గ్రామీణ ప్రాంతాల్లో దొరికే తాటి కల్లు, ఈత కల్లు గురించి అందరికీ తెలుసు.. కానీ ఖర్జూర కల్లు గురించి అంతగా ఎవరికీ తెలియదు. నిజానికి ఈ మధ్యే ఖర్జూర కల్లు గురించి ఎక్కువగా వింటున్నాము. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో దాసరోజు నాగేశ్వర చారి అనే వ్యక్తి తన ఇంటి ముందు 3 ఏళ్ళ క్రితం సరదాగా నాటాడు. చెట్టు ఏపుగా పెరగడంతో తన మిత్రుడు గందసిరి రమేష్ అనే గీత కార్మికుడ్ని సంప్రదించి కర్జూర చెట్టుకు కల్లును తీయిస్తూ అందరికీ ఆసక్తిని కలిగిస్తున్నాడు. కాగా తెల్లని పాలవలె కనిపిస్తున్న ఈ కల్లు అందరి నోళ్ళూ ఊరిస్తోంది. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ కల్లు ఆరోగ్యంతో పాటు, ఆదాయాన్ని ఇస్తుంది. కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి ఖర్జూర కల్లుకు ఉందని కల్లు ప్రియులు అంటున్నారు. ఉదయాన్నే ఈ కల్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని, అద్భుతంగా ఉంటుందని కల్లు ప్రియులు చెబుతున్నారు. తాటి చెట్టు, ఈత చెట్టు అయితే సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే కల్లుని ఇస్తాయి. అదే ఖర్జూర చెట్లు అయితే ఏడాది మొత్తం కల్లుని ఇస్తుంది. ఒక్కో చెట్టు నుంచి రోజుకు 20 లీటర్ల కల్లు వస్తుంది. లీటర్ యాభై రూపాయలకు విక్రయిస్తున్నారు. ఖర్జూర కల్లు తాగేవారి సంఖ్య ఎక్కువగా ఉన్నా చెట్లు తక్కువగా ఉండడంతో సరిపడా కల్లు ఉత్పత్తి చేయలేకపోతున్నామని కల్లు విక్రయదారులు వాపోతున్నారు. ప్రభుత్వం సహకరించి ఖర్జూర చెట్లను పెంచి తమకు ఉపాధి కల్పించాలని గీత కార్మికులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ప్రజలకు ఆరోగ్యవంతమైన ఖర్జూర కల్లును అందిస్తామని తద్వారా ప్రజలు మద్యానికి బానిసై ఆర్థికంగా, ఆరోగ్యంగా నష్టపోకుండా ఉంటారని కల్లు గీత కార్మికులు చెబుతున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.