భారత నౌకాదళానికి సంబంధించిన కీలక రాడార్ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు కాబోతోంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ను వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రక్షిత అటవీ ప్రాంతంలో నెలకొల్పనున్నారు. ఇందుకోసం ఇక్కడి 1174 హెక్టార్ల భూమిని అటవీశాఖ నౌకాదళానికి అప్పగించింది. సంబంధిత ఒప్పంద పత్రాలపై బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు, అటవీ అధికారులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం కమొడోర్ కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈవో రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్దాస్, సీఎస్ శాంతికుమారి, అటవీశాఖ ముఖ్యకార్యదర్శి వాణీప్రసాద్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ పాల్గొన్నారు. వికారాబాద్ డీఎఫ్వో, నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ భూముల కోసం 2010 నుంచి నౌకాదళం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుండగా ఈ విషయం తాజాగా పరిష్కారమైందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ దేశంలో మొదటి వీఎల్ఎఫ్ కేంద్రం. ఇది 1990 నుంచి నౌకాదళానికి సేవలందిస్తోంది. ఈ అటవీప్రాంతంలో ఉన్న ఆలయానికి భక్తుల రాకపోకలను అనుమతించేందుకు నౌకాదళం అంగీకరించింది.
తెలంగాణలో రాడార్ కేంద్రం ఏర్పాటు…
90
previous post