యాదాద్రి పుణ్యక్షేత్రానికి పునర్‌వైభవం వచ్చేలా చర్యలు చేపడతామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి పంచనారసింహుల ఆలయాన్ని మంత్రి సందర్శించారు. క్షేత్రాభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొండ కింద పట్టణంలోని ప్రధాన రహదారిలో అండర్‌పాస్ నిర్మించడం వల్ల స్థానికుల ఉపాధికి తీవ్ర అవరోధం ఏర్పడిందని తెలిపారు. భక్తుల అవసరాలు గమనించకుండా.. చేపట్టిన పనులు పూర్తి కావడానికి రూ.300 కోట్లు అవసరమని వైటీడీఏ అధికారులు చెబుతున్నారన్నారు. గత ప్రభుత్వం విశ్రాంత అధికారులతో చేపట్టిన పనులపై ఆరా తీయనున్నట్లు చెప్పారు. త్వరలో మరో సమీక్ష సమావేశం నిర్వహించి యాదాద్రిలో చోటుచేసుకున్న లోపాలను సరిచేయడంతోపాటు భక్తులకు అవసరమైన వసతులను సమకూర్చేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. భక్తులు దేవుడి చెంత నిద్రచేసే మొక్కుకు అవకాశం కల్పించాలని అధికారులకు మంత్రి సూచించారు. స్వామివారిని భక్తులు ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు సులభంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, క్షేత్రానికి వచ్చే ఆదాయంపై కాకుండా భక్తుల అవసరాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. కొద్ది రోజుల్లోనే సీఎంను ఆహ్వానించి.. యాదగిరిగుట్ట, బస్వాపురం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. క్షేత్ర పరిధిలో దాతలకు స్థలాలు కేటాయిస్తే వారే కాటేజీలు నిర్మించుకుంటారన్నారు. సమీక్షలో విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, జిల్లా కలెక్టర్ హన్మంత్ కె.జెండగే, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేశ్‌చంద్ర, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్‌రావు, యాదాద్రి ఆలయ ఈవో రామకృష్ణారావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
యాదాద్రి పుణ్యక్షేత్రానికి పూర్వ వైభవం వచ్చేలా చేస్తా – కోమటిరెడ్డి
73
previous post