దొంగ ఓట్లతో గెలుపొందిన తిరుపతి వైకాపా ఎంపీ గురుమూర్తిపై కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న అక్రమాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆలస్యంగానైనా కఠిన చర్యలు తీసుకోవడం స్వాగతిస్తున్నామన్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా ఇతర కిందిస్థాయి అధికారులను సస్పెండ్ చేయడం ఇతర అధికారులకు హెచ్చరిక లాంటిదని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ దొంగ ఓటర్ కార్డులు సృష్టించి తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటు వేయడం జగన్ ఆటవిక పాలనకు నిదర్శనమన్నారు. దొంగ ఎపిక్ కార్డులు తయారు చేయడంలో భాగస్వామ్యులైన మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్, ఇతర వైకాపా ఎమ్మెల్యేలు భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీవారి భక్తుల ముసుగులో దొంగ ఓట్లు వేయడానికి వేలాది మందిని వాహనాల్లో తరలించి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారని పేర్కొన్నారు. తాము మొదటి నుంచి ఆరోపిస్తున్నా ఎలక్షన్ కమిషన్ ఎట్టకేలకు స్పందించి కఠిన చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ఒకప్పుడు నిజాయితీ ఐఏఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న గిరీషా అధికార పార్టీ నేతల వత్తిల్లకు తలొగ్గడం వల్లే సస్పెండ్ అయ్యారని పేర్కొన్నారు. ఇప్పటికైనా జగన్ భజన చేస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను తూచా తప్పక పాటించి ఎన్నికలను నిస్వార్ధంగా జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు మల్లారపు రవి ప్రకాష్ నాయుడు ఇతర నేతలు పాల్గొన్నారు.
తిరుపతి ఎంపీపై అనర్హత వేటు వేయాలి…
92
previous post