సోమవారం పిఠాపురంలోని జనసేన కార్యాలయం నుంచి బయటకు వస్తున్న పార్టీ నాయకుడు శ్రీనివాస్ పై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేసారు. మరో ఇద్దరు రెక్కి నిర్వహించారు అంటూ పెద్ద ఆందోళన జరిగింది. శ్రీనివాస్ పోలీస్ కేసు పెట్టారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి కిరణ్ మీడియా సమావేశం కూడా పెట్టారు. దీంతో ఇది సంచలనంగా మారింది. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపారు. ఎవరైతే బైక్ పై వచ్చారో వారితో శ్రీనివాస్ మాట్లాడారని కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ ఇద్దరితో శ్రీనివాస్ మాట్లాడినట్లు, పిఠాపురంలో పార్టీ పరిస్థితి ఏమిటి అని అడిగితే జనసేన బలంగా ఉందంటూ ఆ ఇద్దరు యువకులు చెప్పినట్లుగా కూడా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గతంలో వారు వైసీపీకి పనిచేశారు. దొరబాబుకి టికెట్ లేదని చెప్పడంతో జనసేనకు సానుభూతి పరులుగా మారారు. ఆ కత్తి కూడా దాడి కోసం తీసుకొచ్చింది కాదు. ఆ ఇరువురు పెయింటర్లు. పెయింట్ పని చేసే చోట తుప్పలు అడ్డుగా ఉండటంతో దాన్ని తొలగించేందుకు ఒకరికి ఇచ్చి తిరిగి తీసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో కావాలని సంచలనం సృష్టించేందుకు ఇలా మీడియా సమావేశం పెట్టి తప్పు దోవ పట్టించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చేందుకు పోలీసులు కూడా మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద జనసేనలో ఉత్తిత్తి దాడి సంచలనంగా మారింది. పార్టీని అప్రతిష్ట పాలు చేసిందంటూ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.