ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ మహిళలను ఏడిపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో ఏడుపే మిగులుతుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి అన్నారు. కార్మిక సంఘాల రాష్ట్ర పిలుపులో భాగంగా సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో మంగళవారం నాడు పెద్ద ఎత్తున జైలు భరో కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో సమ్మెలో ఉన్న అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైలు భరో కార్యక్రమం మంగళవారం నాటి ఉదయం తిరుపతి నగరంలో జరిగింది. పాత మున్సిపల్ కార్యాలయం నుండి సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు కార్యకర్తలు, నాయకులతో పాటు అంగన్వాడీలు, ఎస్ఎస్ఏ లు పెద్ద సంఖ్యలో ప్రదర్శన చేపట్టారు. ప్రదర్శన నాలుగు కాళ్ల మండపం వద్దకు చేరుకునేటప్పటికీ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ప్రదర్శనను నిలిపివేయాలని ముందుకు వెళ్లడానికి వీలులేదని ఆంక్షలు పెట్టారు. దీంతో అంగన్వాడీలు, కార్మిక సంఘాల నేతలు నాలుగు కాళ్ల మండపం వద్ద బైఠాయించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఉండటంతో మగ పోలీసులతో అరెస్టు చేయటానికి పోలీసులు సంకోచిస్తూ తటపటాయించారు. ముందుకు పోనివ్వకుండా అరెస్టులు చేయకుండా నడిరోడ్డుపై కూర్చోబెట్టడాన్ని సహించలేని కార్మిక సంఘాల నేతలు తాము ప్రదర్శనని చేపడుతున్నామని ప్రకటించి ముందుకెళ్లారు. తూర్పు పోలీస్ స్టేషన్ డిఎస్పీ అందరినీ అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించడంతో పోలీసుల నడుమ భారీ సంఖ్యలో అంగన్వాడీలను తూర్పు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్టియుల నేతలు కందారపు మురళి, కె. రాధాకృష్ణ, ఆర్. హరికృష్ణలు ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. 29 రోజులుగా సమ్మె సాగిస్తుంటే కనీసం సమస్యల పరిష్కారానికి చర్చించకపోగా ఎస్మాను ప్రయోగించి అంగన్వాడీ మహిళలను అపహాస్యం పాలు చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడటం ఆనవాయితీగా మారిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. తక్షణం కార్మిక సమస్యలు పరిష్కారం చేయకుంటే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించడం ఖాయమని నేతలు హెచ్చరించారు. తూర్పు పోలీస్ స్టేషన్ అంగన్వాడీ మహిళలతో నిండిపోయింది.ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు అంగన్వాడీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
అంగన్వాడీ మహిళలను ఏడిపిస్తున్న ముఖ్యమంత్రి…
81
previous post