గుంటూరు జిల్లా మంగళగిరిలో 8 కోట్ల రూపాయల ఖర్చుతో స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ నిర్మించారు. ఈ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. వైఎస్ షర్మిల గురించి మాట్లాడుతూ రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు పనికిరావు. కాంగ్రెస్ పార్టీని బతికించాలని ఎంతమంది ప్రయత్నించినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిలో 2024 ఎన్నికల్లో మేము విజయం సాధించి తీరుతాం అని ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
టిడిపి మాజీ మంత్రి సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ మరోమారు హాట్ కామెంట్స్ చేశారు. నగరి వైసీపీ ఎమ్మెల్యే మంత్రి రోజా వేసిన ప్రైవేటు కేసు విచారణలో భాగంగా నగరి జిల్లా కోర్టుకు టిడిపి మాజీ మంత్రి సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ హాజరయ్యారు. కోర్టు బయట మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టిడిపి నాయకులను, కార్యకర్తలను వేధించి వారి మీద కేసులు పెట్టి, వారిని భయభ్రాంతులకు గురి చేయాలని ఆలోచిస్తున్నారే తప్ప రాష్ట్రాన్ని గాలి వదిలేసారని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్దతిలో, రూల్ ఆఫ్ లా ప్రకారం కాకుండా తనదైన సైకో పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు పై ఏ ఆధారాలు లేకుండా కేసులు పెట్టారు, ఎలాంటి ఆధారాలు లేకుండా అయనను జైల్లో నిర్బంధించి ఇబ్బందులు పెట్టారు. కోర్టు మొట్టికాయలు వేసింది. వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యక్తిగత ధూషనలకు వెళ్ళారు. కుటుంబంలో మహిళను టార్గెట్ చేశారు, దానికి దీటుగా టిడిపి నాయకులు వ్యవహరిస్తే వారి మీద అక్రమ కేసులు బనాయించి జైలులకు పంపిస్తూ కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని అన్నారు. అందరినీ బెదిరించి, బయపెట్టి అధికారంలో ఉండాలని జగన్ చూస్తున్నాడు. ఇక నాపైనా గుంటూరు, నగరి నుండి చాలా చోట్లు దోంగ కేసులు పెట్టారు. నెల రోజుల్లో చంద్రబాబు, పవన్ పాలనా వస్తుందని, జగన్ నాశనం చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వారిద్దరూ పనిచేస్తారు అన్నారు. ఎన్నికల తరువాత జగన్ రాష్ట్రంలో ఉండడని, జగన్ కు మిగిలేది చంచల్ గూడ జైలు అని అన్నారు. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని, రోజా ముందు తన నోరును సరిచేసుకోవాలని హితవు పలికారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకులే ఉంటారని, తెలుగుదేశం జెండాను చనిపోయే వరకు భుజాన మోస్తూనే ఉంటామని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనార్టీల ద్రోహి అని మాజీ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని అజిజియా షాది మహల్ లో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన మైనార్టీల ఆత్మీయ సదస్సు కార్యక్రమానికి మాజీ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా రాయదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని షాదీ మహల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అజీజీయ షాది మహల్ లో నిర్వహించిన సమావేశానికి మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ శాసనమండలి చైర్మన్ ఎం.ఎ షరీఫ్ మాట్లాడారు. వైసీపీ పాలనలో ముస్లిం మైనారిటీల మాన, ప్రాణాలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వైసిపికి తొత్తుగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ నాయకుల వేధింపుల కారణంగా కొన్ని మైనారిటీ కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బేల్ రద్దు కాకుండా ఉండడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బిజెపి తొత్తుగా మారాడని మండిపడ్డారు. పార్లమెంటులో మైనారిటీల వ్యతిరేక బిల్లులు ఆమోదం పొందేందుకు వైసిపి ఎంపీలు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలికి మైనారిటీలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంధం తండ్రి కొడుకుల బంధం అని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ పేర్కొనడంలోనే వైసిపికి కేంద్రం సహకరిస్తుందని స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొన్నారు.
ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ మహిళలను ఏడిపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో ఏడుపే మిగులుతుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి అన్నారు. కార్మిక సంఘాల రాష్ట్ర పిలుపులో భాగంగా సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో మంగళవారం నాడు పెద్ద ఎత్తున జైలు భరో కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో సమ్మెలో ఉన్న అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైలు భరో కార్యక్రమం మంగళవారం నాటి ఉదయం తిరుపతి నగరంలో జరిగింది. పాత మున్సిపల్ కార్యాలయం నుండి సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు కార్యకర్తలు, నాయకులతో పాటు అంగన్వాడీలు, ఎస్ఎస్ఏ లు పెద్ద సంఖ్యలో ప్రదర్శన చేపట్టారు. ప్రదర్శన నాలుగు కాళ్ల మండపం వద్దకు చేరుకునేటప్పటికీ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ప్రదర్శనను నిలిపివేయాలని ముందుకు వెళ్లడానికి వీలులేదని ఆంక్షలు పెట్టారు. దీంతో అంగన్వాడీలు, కార్మిక సంఘాల నేతలు నాలుగు కాళ్ల మండపం వద్ద బైఠాయించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఉండటంతో మగ పోలీసులతో అరెస్టు చేయటానికి పోలీసులు సంకోచిస్తూ తటపటాయించారు. ముందుకు పోనివ్వకుండా అరెస్టులు చేయకుండా నడిరోడ్డుపై కూర్చోబెట్టడాన్ని సహించలేని కార్మిక సంఘాల నేతలు తాము ప్రదర్శనని చేపడుతున్నామని ప్రకటించి ముందుకెళ్లారు. తూర్పు పోలీస్ స్టేషన్ డిఎస్పీ అందరినీ అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించడంతో పోలీసుల నడుమ భారీ సంఖ్యలో అంగన్వాడీలను తూర్పు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్టియుల నేతలు కందారపు మురళి, కె. రాధాకృష్ణ, ఆర్. హరికృష్ణలు ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. 29 రోజులుగా సమ్మె సాగిస్తుంటే కనీసం సమస్యల పరిష్కారానికి చర్చించకపోగా ఎస్మాను ప్రయోగించి అంగన్వాడీ మహిళలను అపహాస్యం పాలు చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడటం ఆనవాయితీగా మారిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. తక్షణం కార్మిక సమస్యలు పరిష్కారం చేయకుంటే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించడం ఖాయమని నేతలు హెచ్చరించారు. తూర్పు పోలీస్ స్టేషన్ అంగన్వాడీ మహిళలతో నిండిపోయింది.ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు అంగన్వాడీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఇంజనీర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీ ని విజయవాడలో సంఘం నాయకులు ఘనంగా ఆవిష్కరించారు. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ చైర్మన్ శైలేంద్ర కుమార్ దుబే పాల్గొనగా ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రావు 2024 డైరీ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రావు మాట్లాడుతూ 2022వ సంవత్సరానికి సంబంధించిన వేతన సవరణ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పవర్ ఇంజనీర్స్ కు తీవ్ర అన్యాయం జరిగిందని, విద్యుత్ మేనేజ్మెంట్ లోపభూయిష్టమైన విధానాలతో ఇంజనీర్లకు వేతన సవరణలో అలసత్వం చోటుచేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ల డిమాండ్లపై విద్యుత్తు శాఖ మేనేజ్మెంట్ తో చర్చించి న్యాయమైన డిమాండ్ల సాధనకు కృషి చేయాలని ఆయన కోరారు. పిఆర్సి లో పవర్ ఇంజనీర్లకు జరిగిన అన్యాయం పై ఇప్పటికే పొరుగు రాష్ట్రాల సంఘాలు మద్దతు తెలిపాయని, మేనేజ్మెంట్ మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు తమకు అనుమానాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. వెంటనే వేతన సవరణ నెరవేర్చాలని కోరారు. ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సంగం రాష్ట్ర అధ్యక్షులు జి బి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు నాగ ప్రసాద్, రత్నాలరావు పలువురు పాల్గోన్నారు.
అవ్వ తాతలకు ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మనసున్న ముఖ్యమంత్రిని మళ్లీ గెలిపించాలని మాజీ డిప్యూటీ సీఎం నరసన్నపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సోమవారం నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో వైయస్సార్ పెన్షన్ కానుక.. ఇకపై నుండి రూ. 3000 వేల రూపాయలకి పెంపు.. ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అందరూ ఆదరించాలని.. మళ్లీ గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 99% నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా పెన్షన్ లబ్ధిదారులకు పెంచిన 3000 రూపాయలు పెన్షన్ డబ్బులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకోవడానికి వస్తుంటారని.. వారి కల్లబొల్లి మాటలు ప్రజలెవరు నమ్మవద్దని హితువు పలికారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతుందని దానిని ఎవరు ఆపలేరని ఆయన పేర్కొన్నారు.
బాపట్లలో 15వ రోజు అంగన్వాడిలు రోడ్డుపై నల్ల బెలూన్లతో వారి నిరసనను తెలియజేసారు. సీఎం డౌన్ డౌన్ అన్న నినాదాలతో మాట తప్పను మడమ తిప్పను అన్న సీఎం మాట తప్పాడు. మనిషి ముఖం తిప్పాడు అనే నినాదాలతో రోడ్డుపై నిల్చోని అంగన్వాడీలు హోరెత్తించారు. బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 15వ రోజు అంగన్వాడీలు నల్ల బెలూన్లతో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసు నుండి పాత బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి నల్ల బెలూన్లు పాత బస్టాండ్ సెంటర్ లో వదిలి నిరసన తెలిపారు. లక్షపై చిలుకు ఉన్న అంగన్వాడీల పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యం అని వారు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ 15 రోజుల నుండి మేము సమ్మెలు, దీక్షలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చీమకుట్టినట్లు అయినా లేదని, అంగన్వాడీల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి మాకెంతో బాధ కలిగిస్తుందని వారు అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడీల పట్ల దయ చూపి వారి డిమాండ్లను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగనవాడిలపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తుందని వారన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడిల డిమాండ్లను పరిష్కరించాలని వారు అన్నారు.
ప్రతి పెదవాడి సొంత ఇంటి కల నెరవేర్చడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామంలో 13.90 ఏకరాలలో అర్హులైన 415 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి చేతుల మీదుగా జగనన్న ఇళ్ల పట్టాలను పంపిణి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో ఎన్ని అడ్డంకులు వచ్చిన ప్రతి లబ్దిదారునికి ఈ రోజు పట్టా ఇవ్వడం జరుగుతుందన్నారు. కానీ టీడీపీ వారు ఏమి చేయకున్నా ప్రభుత్వం పై తప్పుడు నిందలు వేస్తున్నారని, ప్రజలకు ఎవరు మంచి చేస్తున్నారో గుర్తించలన్నారు. కావున వచ్చే ఎన్నికల్లో ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తోడుగా నిలబడాలని తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎండీఓ కార్యాలయం వద్ద చెవిలో పువ్వులు పెట్టుకుని అంగన్వాడీలు వినూత్న నిరసన చేపట్టారు. 10వ రోజు నిరసనలో భాగంగా చెవిలో పువ్వులు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. జనసేన మైలవరం ఇంచార్జ్ అక్కల రామ్మోహనరావు నిరసనలో పాల్గొని అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అధికారం కోసం ఉచిత హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత హామీలను తుంగలో తొక్కేసాడు. రాష్ట్రం మొత్తం అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చెవిలో పూలు పెట్టి వాళ్లకు జీతాలు పెంచుతానని చెప్పి మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీ చేతగాని పరిపాలన వల్ల రాష్ట్రం మొత్తం కొన్ని లక్షల అంగన్వాడీలు రోడ్డెక్కి వాళ్ళని దీనస్థితికి తీసుకువచ్చారు. ఎవరైతే నీకు ఓటు వేసి గెలిపించారో వాళ్లే రేపు తిరిగి నిన్ను ఇంటికి పంపుతారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీర్చకపోతే తగు బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉమ్మడి ప్రభుత్వం రాగానే అంగన్వాడీలకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.





Total views : 90432