తెలంగాణలో ధరణి పోర్టల్ వ్యవస్థపై మరింత లోతైన అధ్యయనం చేసే దిశలో ప్రభుత్వం నియమించిన కమిటీ ముందుకెళ్తోంది. కలెక్టర్లతో సమావేశమైన కమిటీ.. పోర్టల్‌లో అనేక లోపాలున్నాయని గుర్తించింది. 35 మ్యాడ్యూల్స్ ప్రజలకు ఉపయోగపడేట్లు లేవని తేల్చింది. 18లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తుండగా.. 23 లక్షల ఎకరాలు పార్ట్-బిలో ఉన్నట్లు కమిటీ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. కలెక్టర్లతో సుదీర్ఘంగా చర్చించిన కమిటీ… ఈనెల 27న గిరిజన, అటవీ, వ్యవసాయ శాఖల అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించింది. భూ రికార్డులను కంప్యూటరీకరణ చేసిన గత ప్రభుత్వం ధరణి పోర్టల్ పరిధిలోకి తీసుకొచ్చింది. సంకల్పం గొప్పదైనా.. ఆచరణలో మాత్రం ఇబ్బందులు వచ్చాయి. ఎన్నికల సమయంలో ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని.. దాని స్థానంలో మెరుగైన మరో వ్యవస్థను తీసుకొస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడగానే ధరణి పోర్టల్ వ్యవస్థపై అధ్యయనానికి కమిటీని వేసింది. నాలుగుసార్లు సమావేశమైన కమిటీ ధరణి పోర్టల్ అమలులో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించింది. సచివాలయంలో ఐదు జిల్లాల కలెక్టర్లతో సుదీర్ఘంగా సమావేశమైంది. కలెక్టర్లు సైతం చాలా లోపాలను తమ దృష్టికి తెచ్చారని కమిటీ పేర్కొంది. తెలంగాణలో భూసమస్యలను పరిష్కరించాలంటే ధరణి సాఫ్ట్‌వేర్‌ను మార్చితే సరిపోదని..చట్టాలను సైతం మార్చాల్సిన అవసరం ఉందని కమిటీ ప్రాథమికంగా అభిప్రాయపడింది. ధరణి పోర్టల్ వ్యవస్థ సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చేట్లు లేదని వ్యాఖ్యానించింది.
55
previous post