ఆంధ్రప్రదేశ్ (TDP Politics) : రాష్ట్రంలో టీడీపీ,జనసేన కూటమిగా ఏర్పడి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పై పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి… ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు వరుస భేటీలతో రాష్ట్రంలోని ఎమ్మెల్యే అభ్యర్థుల సీట్ల సర్దుబాటులో బిజీగా ఉంటే… మరోపక్క రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సీటు ఆశించే అభ్యర్థులు సీటు నాకంటే,నాకంటూ తమ బలాబలాలను చూపించుకుంటూ టికెట్ కోసం ప్రయత్నాలు జరుపుతున్నారు.. మరోపక్క కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేది నువ్వా నేనా అంటూ కూడా టీడీపీ తమ్ముళ్లు కుమ్ములాడుకుంటున్నారట.
TDP Politics @ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా…
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మధ్య టికెట్ వార్ తారాస్థాయి చేరింది. రెండు పర్యాయాలు ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేసిన వేటుకూరి శివరామరాజు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి తిరిగి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోపక్క సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామరాజు అలియాస్ రాంబాబు మరొక అవకాశం ఇస్తే ఉండి నియోజకవర్గ నుంచి పోటీ చేసి గెలిచి తీరుతా అంటూ అధిష్టానం వద్ద టికెట్ కోసం ప్రయత్నాలు జరుపుతున్నారట. దీంతో ఉండి నియోజకవర్గంలో టికెట్ మాజీ ఎమ్మెల్యే కి ఇవ్వాలో, సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇవ్వాలో తెలియక అధిష్టానం తలలు పట్టుకుంటుందట.
ఉండి నియోజకవర్గంలో 2009లో టీడీపీ నుంచి పోటీ చేసిన వేటుకూరి శివరామరాజు అప్పటి కాంగ్రెస్ వేవ్ లో కూడా బారి మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి పై పోటీ చేసి గెలుపొందారు. 2009లో కాంగ్రెస్, టీడీపీ ప్రజా రాజ్యం పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేశాయి. రాష్ట్రంలో త్రిముఖ పోటీ అప్పుడు ఏర్పడింది. 2009 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సీట్లతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచిన ఉండి నియోజకవర్గంలో మాత్రం టిడిపి తరఫున పోటీ చేసిన వేటికూరి శివరామరాజు విజయం సాధించారు.
శివరామరాజు ప్రతిపక్షంలో ఉన్న నాలుగు సంవత్సరాలు నిత్యం ప్రజా సమస్యలపై వినూత్న రీతిలో నిరసనలు చేస్తూ అప్పట్లో రాష్ట్రమంతా తన వైపు చూసే విధంగా శివరామరాజు కార్యక్రమాలు చేపట్టారు. దీంతో 2014లో టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి మళ్లీ శివరామరాజుకే టికెట్ ఇచ్చారు. దీంతో 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నరసింహ రాజు పై శివరామరాజు పోటీ చేసి గెలుపొందారు… ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019 ఎన్నికల్లో అనుకోని పరిస్థితుల్లో టీడీపీ బాస్ ఆదేశాలతో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా శివరామరాజు పోటీ చేశారు. అప్పటివరకు టీడీపీలో ఉన్న ప్రస్తుత ఎంపీ రఘురామకృష్ణరాజు 2019 ఎన్నికల్లో ఒక్కసారిగా టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేవారు కరువయ్యారు.
ఈ నేపథ్యంలోనే శివరామరాజు తన అనుచరుడు రామరాజుని టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి ఎంపీ సీటు తన అనుచరుడుకి ఇవ్వాలని దగ్గరుండి గెలిపించుకుంటానని అన్నారు. అయితే చంద్రబాబు మాత్రం శివరామరాజుని ఎంపీగా పోటీ చేయమని, రామరాజుని ఎమ్మెల్యేగా పోటీలో నిలబెడదామని చెప్పడంతో టిడిపి బాస్ ఆదేశాలు శిరసా వహించిన శివరామరాజు నరసాపురం ఎంపీ అభ్యర్థి గా పోటీ చేసారు. అప్పటి ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ, వైసిపి జనసేన ల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్నది… నరసాపురం పార్లమెంటు స్థానంలో టీడీపీ తరఫున శివరామరాజు, జనసేన తరఫున సినీ నటుడు నాగబాబు, వైసీపీ తరఫున రఘురామకృష్ణరాజు పోటీ చేశారు. వైసీపీ తరఫున పోటీ చేసిన రఘు రామ కృష్ణం రాజు విజయం సాధించారు. ఇదిలా ఉండగా ఉండి నియోజకవర్గంలో పోటీ చేసిన రామరాజు విజయం సాధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
గత ఎన్నికల్లో టీడీపీ నుంచి మంతెన రామరాజు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన శివరామరాజు పార్టీ బలోపేతానికి తనదైన శైలిలో కృషి చేశారు. ఆయనకున్న ఫాలోయింగ్‌ను చూసిన పార్టీ అధిష్టానం.. 2019లో నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దింపింది. అయితే.. ఆ ఎన్నికల్లో శివరామరాజు ఓటమి పాలయ్యారు. అప్పుడు శివరామరాజు సూచనతోనే మంతెన రామరాజుకు ఉండి టికెట్ కేటాయించింది టీడీపీ అధిష్టానం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆయన.. నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక క్యాడర్‌ను తయారు చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సిట్టింగ్ ఎమ్మెల్యే.. మరోసారి ఉండి నుంచే పోటీచేసే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తనకు బెర్త్ కన్ఫార్మ్ అయ్యిందని.. పోటీచేసేది తానేని ప్రకటించి ప్రచారం సైతం ప్రారంభించారు.
నరసాపరం పార్లమెంటు స్థానంలో పోటీ చేసి ఓడిపోయిన శివరామరాజు నాలుగు సంవత్సరాల నుంచి తిరిగి తన సొంత నియోజకవర్గమైన ఉండిలో తన పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న రామరాజు మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు వ్యతిరేకంగా పార్టీ కార్యకలాపాలు సాగిస్తున్నారు. అప్పటివరకు అన్నదమ్ముల్లా ఉన్న శివరామరాజు, రామరాజులు బద్ధ శత్రువుల్లా మారారు. ప్రస్తుతం ఇరువురి మధ్య టిక్కెట్ కోసం పెద్ద యుద్ధమే జరుగుతుందట.
ఈసారి నేను పోటీ చేస్తా.. నువ్వు పక్కకి తప్పుకో…
ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే.. మరోవైపు మాజీ ఎమ్మెల్యే టికెట్ నాదే అంటే నాదే అంటూ పోటీపడుతున్నారు. సీటు తమకే వస్తుందన్న ధీమాతో ఎవరికి వారు ప్రచారం సైతం ప్రారంభించారు. దీంతో ఎవరి వైపు ఉండాలో తెలియక కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఇద్దరు నేతల మధ్య ఈ కోల్డ్ వార్‌ను అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. 2019 ఎన్నికల్లో నేను తీసుకువచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించి మద్దతు ఇస్తేనే నువ్వు గెలిచావు. ఈసారి ఎన్నికల్లో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా పక్కకు తప్పుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే ఫైట్ చేస్తుంటే. నాకు నియోజకవర్గంలో క్యాడర్ ఉంది ఈసారి నేను పోటీ చేసి గెలుపొందుత నాకే టిక్కెట్ కావాలంటూ టికెట్ కోసం రామరాజు మరో పక్క ఫైట్ చేస్తున్నారట. ఇప్పటికే ఇరు వర్గాలు పార్టీ బాస్ వద్ద టికెట్ కోసం పంచాయతీలు పెట్టారట. దీంతో ఎటు తేల్చలేని పార్టీ అధిష్టానం స్తబ్ధతగా ఉండిపోయిందట.
ఇదిలా ఉండగా పార్టీ అధిష్టానం టికెట్ నాకే ఇస్తుందని సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఇప్పటికే ధీమాగా ఉండగా, ఇంకోవైపు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు వర్గం ఈ స్థాయిలోనే ధైర్యంగా ఉంది. అయితే తెలుగుదేశం నాయకత్వం మాత్రం దీనిపై స్పష్టతకు రాలేదు.
ఇప్పటికైనా అధిష్టానం మాజీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న టికెట్ వార్ ను చక్కదిద్ది. పార్టీ క్యాడర్ లో నెలకొన్న గందరగోళానికి చెక్ పెట్టాలని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారట.
Read also : Visakha | ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికై సంతకాల సేకరణ – జై భారత్ పార్టీ
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.