ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పుట్టపర్తి వైసీపీలో వర్గ విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది రోజురోజుకూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ని లక్ష్యంగా చేసుకుని ఆయన సొంత మండలంలో వైసీపీ కీలక నేతలు సమావేశం నిర్వహించడం నియోజక వర్గ వైసీపీలో కలకలం రేపుతోంది. ఈ అసమ్మతి నేతల సమావేశానికి వైసీపీ సీఈసీ సభ్యులు… కొత్తకోట సోమశేఖర్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయ భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీ పాముదూర్తి, ఎంపీటీసీ ఇంద్రజిత్ రెడ్డి నాయకత్వం వహించడం కొస మెరుపుగా నిలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే మూకుమ్మడిగా కలసి ఓడించి తీరతామని ప్రతిన బూనడం కొసమెరుపు జగనన్న ముద్దు…. దుద్దుకుంట వద్దు అన్న నినాదాలతో సమావేశంలో హోరెత్తించారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఎమ్మెల్యే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్యకర్తలను అస్సలు పట్టించుకోవడం లేదన్నారు. సొంత పార్టీ కార్యకర్తలనే ఎమ్మెల్యే ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సమిష్టిగా అందరూ కలిసికట్టుగా గత ఎన్నికల్లో టిడిపి తరఫున బలమైన టిడిపి అభ్యర్థి రఘునాథరెడ్డిని ఓడించామని, ఇప్పుడు శ్రీధర్ రెడ్డికి మాత్రం టికెట్ ఇవ్వకూడదని అందరూ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఆయనకు టికెట్ ఇస్తే వైసీపీలో ఎవరు సహకరించే పరిస్థితిలో లేరన్నారు. స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తున్న ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకొని సీఎం జగన్ కు కానుకగా ఇస్తామన్నారు.
కొసమెరుపు :
అసమ్మతి నేతలందరూ నల్లమాడ మండల కేంద్రంలోని ఓ సమావేశ భవనంలో సభ నిర్వహిస్తుండగా పోలీసు అధికారులు రంగప్రవేశం చేసి ఇక్కడ ఎందుకు సమావేశం నిర్వహిస్తున్నారో కాస్త వివరణ ఇవ్వాలని అసమ్మతి నేతలను అడ్డుకున్నారు. పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగి సమావేశాన్ని యథాతథంగా నిర్వహించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.