Thursday, October 15, 2026
News Navigation
Thursday, October 15, 2026
News Navigation

Breaking

Thursday, October 15, 2026
Home Latest News వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..

వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..

by CVR NEWS
అత్తామామలు మౌనంగా ఉంటే వేధింపుల కేసు కుదరదు -సుప్రీం

వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెనుకబడిన కులాల్లో పుట్టినప్పటికీ ఆర్థికంగా , విద్యాపరంగా, వృత్తి పరంగా ఉన్నత స్థానాల్లో ఉన్న కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలు ఎందుకని ప్రశ్నించింది. ఇది సహేతుకంగా ఉన్నప్పటికీ..ఐఏఎస్ ల కుటుంబాలను మాత్రమే ఉదాహరణగా చూపించింది. క్రీమీ లేయర్ దాఖలైన పిటిషన్ ను జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ధర్మాసనం విచారించింది..రిజర్వేషన్ల ద్వారా సామాజిక ఆర్థిక సమానతలు పెరుగుతాయనీ…అలాంటి వారి పిల్లల రిజర్వేషన్లు కొనసాగించడం సరికాదని..ఇది ఆలోచించాల్సిన విషయమని అభిప్రాయపడింది. కోటాల ద్వారా సామాజికంగా ఉన్నతస్థాయికి చేరుకున్న కుటుంబాలు ఇకనైనా రిజర్వేషన్ల నుంచి బయటకు రావాలని కోర్టు సూచించింది.
పేరెంట్స్ ఐఏఎస్ ఆఫీసర్లంటే.. ఇద్దరూ ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారే. వారికి సమాజంలో పురోగతి, అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. విద్యా, ఆర్థిక సాధికారతతో సామాజిక పురోగతి సాధ్యమవుతుందని, ఆ తర్వాత కూడా వారి పిల్లలకు రిజర్వేషన్లు కోరుకుంటే, మనం ఈ వ్యవస్థ నుండి ఎప్పటికీ బయటపడలేమని పేర్కొన్న ధర్మాసనం.., ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన విషయమని అభిప్రాయపడింది. సదరు వ్యక్తులను వారి జీతం ఆధారంగా కాకుండా ..వారి హోదా ఆధారంగా మినహాయించారని, దీనిపై లోతైన పరిశీలన అవసరమని పిటిషనర్ల తరఫు న్యాయవాది శశాంక్ రత్నూ కోరారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి, క్రీమీ లేయర్‌కు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉండాలన్నారు. EWS కేటగిరీలో సామాజిక వెనుకబాటుతనం ఉండదని, కేవలం ఆర్థిక వెనుకబాటుతనం మాత్రమే ఉంటుందని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు. అయితే.. క్రీమీ లేయర్ ప్రమాణాలు EWS కంటే చాలా సరళంగా ఉండాలని, లేకపోతే రెండింటికీ తేడా ఉండదని న్యాయవాది వాదించారు. వ్యవస్థలో కొంత సమతుల్యత ఉండాలని, రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొంది తల్లిదండ్రులు ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నా తర్వాత పరిస్థితులు మారుతాయని పేర్కొన్నారు.ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు సంబంధిత పక్షాలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి సమాధానాలను కోరింది.
వెనుకబడిన తరగతులలోని క్రీమీ లేయర్‌కు రిజర్వేషన్ ప్రయోజనాలపై దాఖలైన పిటిషన్లను పరిశీలిస్తున్న న్యాయస్థానం.. కుల ఆధారిత సామాజిక వెనుకబాటుతనాన్ని ఆర్థిక హోదా అధిగమించగలదా అనే అంశాన్ని తిరిగి సమీక్షిస్తోంది. 1992 నాటి చారిత్రాత్మక ‘ఇంద్ర సాహ్ని’ (మండల్ కేసు) తీర్పులో సుప్రీంకోర్టు ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను సమర్థిస్తూనే, వారిలోని ‘క్రీమీ లేయర్’ వర్గాలను కోటాల నుండి మినహాయించాలని స్పష్టం చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ.8 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న ఓబీసీ కుటుంబాలను క్రీమీ లేయర్‌గా పరిగణిస్తారు. అలాగే ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, సీనియర్ బ్యూరోక్రాట్లు, మిలిటరీ ఉన్నతాధికారుల పిల్లలకు ఆదాయంతో సంబంధం లేకుండా మినహాయింపు వర్తిస్తుంది. కాగా, తల్లిదండ్రుల ఉద్యోగ హోదా, కేటగిరీని కూడా పరిగణనలోకి తీసుకోవాలని, కేవలం ఆదాయమే క్రీమీ లేయర్ మినహాయింపుకు ఏకైక ప్రమాణం కాబోదని… ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పులో స్పష్టం చేసింది. తల్లిదండ్రులు ఉన్నతస్థాయికి చేరుకుంటే…వారి పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా? అని ప్రశ్నిచింది. ఎలాంటి ఆర్థిక స్తోమత..ఉన్నత ఉద్యోగాలు లేని వారి పిల్లలు ఎప్పటికీ వెనుకబాటు తనాన్ని అనుభవించాల్సి వస్తోందనే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తంచేసింది.
కాగా రిజర్వేషన్లపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీసీల్లోనే కాదు…ఓబీసీల్లోనూ, ఎస్సీ, ఎస్టీల్లోనూ ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత పదవులు అనుభవిస్తున్నవాళ్ల పిల్లలు కూడా ఇంకా ఆయా రిజర్వేషన్ల నుంచి బయటపడడం లేదు. ఐఏఎస్, ఐపీఎస్..రాజ్యాంగ పదవులు లేదా ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్న వాళ్ల పిల్లలు కూడా ఇంకా రిజర్వేషన్ సౌకర్యాన్ని ఆశిస్తున్నారు. ఇలా అన్ని సామాజిక వర్గాలు అనుభవిస్తున్న రిజర్వేషన్లను..మరోసారి ఆలోచించాల్సిన అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ రిజర్వేషన్ కైనా ఆర్థిక,సామాజిక వాస్తవ స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు చెప్పడాన్ని స్వాగతిస్తున్నారు. బీసీ వర్గాల నుంచి రాజకీయ పదవులు అనుభవిస్తున్న నాయకులు లేదా ఉన్నత పదవుల్లో ఉన్న బీసీ ధనవంతుల పిల్లలకు రిజర్వేషన్ల ప్రస్తావన తేకపోడం కొంత గందరగోళానికి ఆస్కారమిచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. ఏ వర్గంలోనైనా ధనవంతుల పిల్లలు రిజర్వేషన్ సౌకర్యాన్ని, ప్రయోజనాలు పొందడంపై మరోసారి లోతైన చర్చకు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు దోహదం చేస్తాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: