రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రంలో ఇంధనానికి ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. సరఫరా వ్యవస్థలో తలెత్తిన చిన్నపాటి సాంకేతిక లోపాల వల్లే కొన్నిచోట్ల బంకులు మూతపడ్డాయని, ఈ పరిస్థితిని త్వరలోనే చక్కదిద్దుతామని ఆయన పేర్కొన్నారు.
అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై మంత్రి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్ డిపోలు, ప్రైవేట్ అవుట్లెట్లను నిరంతరం పర్యవేక్షించాలని, క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్లకు సూచించారు. వాహనదారులలో భయాందోళనలు కలగకుండా ఎప్పటికప్పుడు సరైన సమాచారాన్ని మీడియా ద్వారా తెలియజేయాలని కోరారు.
ముఖ్యంగా రద్దీ సమయాల్లో బంకుల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. సరఫరా గొలుసు దెబ్బతినకుండా చూడటమే కాకుండా, ప్రైవేట్ కంపెనీల డిపోలను కూడా తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.




Total views : 56592