భాగ్యనగరంలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా టాటా ఐపీఎల్ 2026 సందడికి రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 5 నుంచి మే 22 వరకు జరిగే ఏడు కీలక మ్యాచ్‌ల కోసం భాగ్యనగరం ముస్తాబైంది. సుమారు 39 వేల మంది ప్రేక్షకులు తరలివస్తారని అంచనా వేస్తున్న వేళ.. పోలీసులు నగరంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇవాళ్ల మధ్యాహ్నం 12 గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. వరంగల్ హైవే నుంచి వచ్చే భారీ వాహనాలను ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మళ్లిస్తున్నారు. ఎల్బీ నగర్ నుంచి వచ్చే లారీలను నాగోల్ వైపు.. ఘట్‌కేసర్ వైపు నుంచి వచ్చే వాహనాలను బోడుప్పల్ వైపు దారి మళ్లిస్తూ రాచకొండ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
స్టేడియం లోపల, బయట కలిపి మొత్తం 2 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాలతో పాటు స్పెషల్ ఫోర్స్, బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. 430 సీసీటీవీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రతి మూలనూ నిశితంగా పరిశీలించనున్నారు. ముఖ్యంగా మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ నిరంతరం పహారా కాయనున్నాయి. మ్యాచ్ చూడటానికి వెళ్లే వారు నిబంధనలు పాటించాల్సిందే. ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, బ్యాగులు, వాటర్ బాటిళ్లు, బయటి ఆహార పదార్థాలను స్టేడియంలోకి అనుమతించబోమని పోలీసులు తేల్చి చెప్పారు. సిగరెట్లు, లైటర్లతో పాటు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని స్పష్టం చేశారు. కేవలం మొబైల్ ఫోన్లకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు.
పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టే ఉత్తమమని పోలీసులు సూచిస్తున్నారు. స్టేడియం సమీపంలో వాహనాల నిలుపుదలపై నిషేధం విధించిన నేపథ్యంలో.. ప్రేక్షకులు మెట్రో లేదా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరుతున్నారు. మెట్రో రైళ్ల వేళలను కూడా మ్యాచ్ సమయానికి అనుగుణంగా పొడిగించేలా చర్యలు తీసుకుంటున్నారు.





Total views : 47737