ఆంధ్రప్రదేశ్‌ను నిప్పుల కొలిమిలా మారుస్తున్నాయి ఎండలు. అగ్నిగోళంలా మారుతున్న భానుడి భగభగలకు రాష్ట్రం విలవిలలాడుతోంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 73 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర నుంచి గోదావరి జిల్లాల వరకు సెగలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. జిల్లాల వారీగా చూస్తే.. విజయనగరంలో 24, శ్రీకాకుళంలో 16, మన్యంలో 15 మండలాలపై వడగాల్పుల పంజా విసరనున్నాయి. ఇప్పటికే పార్వతీపురం మన్యంలో 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. రానున్న 48 గంటలు అత్యంత కీలకం కానున్నాయి.
వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌లను విరివిగా తీసుకోవాలని కోరుతున్నారు. పోలవరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లోనూ ఎండల తీవ్రత భయంకరంగా ఉండబోతోంది. సాధారణ వడగాలుల ప్రభావం మరో 17 మండలాల్లో ఉండనుండగా.. ఆదివారం కూడా 30కి పైగా మండలాల్లో తీవ్ర ఎండలు ఉంటాయని అంచనా. ఎండ తీవ్రతను బట్టి ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం. రాయలపేట నుంచి నాతవరం వరకు.. భామిని నుంచి కాకినాడ వరకు ఎక్కడ చూసినా ఎండలు దంచి కొడుతున్నాయి. మే నెల రాకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలను పాటిస్తూ.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.





Total views : 81449