తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ సంస్థ ఒకప్పుడు దేశంలోనే ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. లక్ష మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పిస్తూ అనేక పట్టణాల అభివృద్ధికి కారణమైంది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు వరుసగా చేజారడం, కార్మికుల సంఖ్య తగ్గిపోవడం, నిర్వహణలో నిర్లక్ష్యం వంటి అంశాలు సంస్థ భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గాను కేవలం 58 మిలియన్ టన్నులకే పరిమితమవడం సంస్థ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒకప్పుడు లాభాల బాటలో దూసుకెళ్లిన సింగరేణి ఇప్పుడు అప్పుల బారిన పడటం, బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి రావడం ఆ సంస్థ ఆర్థిక స్థితిని స్పష్టంగా చూపిస్తోంది.
సింగరేణి సంక్షోభానికి ప్రధాన కారణం ప్రభుత్వ బకాయిలేనని కార్మిక సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. జెన్కోకు సరఫరా చేసిన బొగ్గు, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన చెల్లింపులు భారీగా పెండింగ్‌లో ఉండటంతో సంస్థ ఆర్థికంగా కుదేలైందని చెబుతున్నారు. దాదాపు రూ.55 వేల కోట్లకు పైగా ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉందని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితి వల్ల ఉద్యోగుల జీతాలు చెల్లించడానికే అప్పులు తీసుకునే దుస్థితి ఏర్పడిందని విమర్శిస్తున్నారు. మెయింటెనెన్స్ పనులు సక్రమంగా చేయలేకపోవడం వల్ల యంత్రాలు దెబ్బతింటున్నాయని, దాని ప్రభావం ఉత్పత్తిపై పడుతోందని అంటున్నారు. మరోవైపు సంస్థకు సంబంధించిన నిధులను ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లిస్తోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఫుట్‌బాల్ ఈవెంట్ల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం పై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వాలు సింగరేణిని ఆదుకునే దిశగా తక్షణ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
సింగరేణి భవిష్యత్తుపై కార్మికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కేంద్ర ప్రభుత్వం కొత్త బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి కేటాయించకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని మైనింగ్ కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల కార్మికుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఓపెన్ కాస్ట్ మైన్స్‌లో బొగ్గు తవ్వకాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తే శాశ్వత ఉద్యోగాలు తగ్గిపోతాయని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే కార్మికుల సంఖ్య క్రమంగా తగ్గుతుండగా, కొత్త నియామకాలు లేకపోవడం యువతలో ఆందోళన కలిగిస్తోంది. మెడికల్ బోర్డులు ఏర్పాటు చేసి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సింగరేణిని బలహీనపరిస్తే దాని ప్రభావం కేవలం ఉద్యోగులపైనే కాకుండా మొత్తం బొగ్గు బెల్ట్ ప్రాంతాలపై పడుతుందని చెబుతున్నారు. సింగరేణి ఆధారంగా అభివృద్ధి చెందిన పట్టణాలు ఆర్థికంగా దెబ్బతింటాయని, వేలాది చిన్న వ్యాపారాలు మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సింగరేణి కేవలం ఒక ప్రభుత్వ సంస్థ మాత్రమే కాదు… తెలంగాణ జీవనాడిగా భావించే పరిశ్రమ. ఈ సంస్థపై లక్షలాది కుటుంబాల భవిష్యత్తు ఆధారపడి ఉంది. సింగరేణి ప్రైవేటీకరణ జరిగితే విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు పెరిగి, ప్రజలపై భారీ భారం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థగా ఉండటం వల్లే తక్కువ ధరలకు బొగ్గు, విద్యుత్ అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. కార్మిక సంఘాలు కూడా కోల్ ఇండియా తరహాలో సింగరేణి కార్మికులకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా పెర్క్స్‌పై ఇన్‌కమ్ టాక్స్ యాజమాన్యమే భరించాలని కోరుతున్నారు. అలాగే బొగ్గు ఉత్పత్తి పనులను పూర్తిగా సింగరేణి యంత్రాలు, శాశ్వత కార్మికులతోనే నిర్వహించాలని స్పష్టం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం పడే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సంక్షోభంలో 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి
ఉత్పత్తి లక్ష్యాన్నీ చేరుకోలేకపోతున్న సింగరేణి
రూ.55 వేల కోట్ల బకాయిలతో సింగరేణిపై ఆర్థిక భారం
ప్రైవేటీకరణ భయాలతో భవిష్యత్ పై కార్మికుల్లో ఆందోళన
కొత్త బొగ్గు బ్లాక్‌లు ఇవ్వకపోవడంపై కేంద్రంపై విమర్శలు..!






Total views : 82540