Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home Latest News యాదాద్రిలో హాట్ టాపిక్ గా ప్రభుత్వ భూముల వివాదం..

యాదాద్రిలో హాట్ టాపిక్ గా ప్రభుత్వ భూముల వివాదం..

by CVR NEWS
యాదాద్రిలో హాట్ టాపిక్ గా ప్రభుత్వ భూముల వివాదం

యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ భూముల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఆలేరు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అధికార పార్టీకే కాకుండా స్థానిక అధికార యంత్రాంగానికీ సవాలుగా మారాయి. ముఖ్యంగా రాజపేట మండలం చల్లూరు గ్రామంలోని సర్వే నంబర్ 322లో కొనసాగుతున్న క్రషర్ యూనిట్ చుట్టూ వివాదం రోజురోజుకూ మరింత ముదురుతోంది. అనుమతులు లేకుండా క్రషర్ యూనిట్ నడుస్తోందని, ప్రభుత్వ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేరు వినిపించడం రాజకీయంగా మరింత చర్చకు దారితీసింది. ప్రజావాణి కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తూ వినతిపత్రం సమర్పించారు. అధికారుల స్పందన లేకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దీంతో ఇప్పుడు చల్లూరు క్రషర్ వివాదం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

చల్లూరు గ్రామంలోని క్రషర్ యూనిట్‌పై స్థానిక రైతులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ స్థాయిలో జరుగుతున్న బ్లాస్టింగ్‌ల వల్ల గ్రామం మొత్తం భయాందోళనలకు గురవుతోందని చెబుతున్నారు. బ్లాస్టింగ్ సమయంలో భూములు కంపిస్తుండటంతో ఇళ్లలో పగుళ్లు వస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోజంతా క్రషర్ నుంచి ఎగిసిపడుతున్న దట్టమైన దుమ్ముతో గ్రామం కాలుష్యానికి గురవుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పంటలపై దుమ్ము పేరుకుపోవడంతో దిగుబడులు తగ్గిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. చెరువు నీరు కూడా కలుషితమై పశువులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. గడ్డి, పశువుల మేతపై దుమ్ము పేరుకుపోవడంతో పశువుల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని అంటున్నారు. గ్రామంలో చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలు, దగ్గు, అలర్జీలతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని, రైతులకు నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

అయితే తమపై వస్తున్న అన్ని ఆరోపణలను శ్రీని కన్‌స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ యాజమాన్యం పూర్తిగా ఖండిస్తోంది. సంస్థ ఎండీ కర్నాటి శ్రీదేవి మాట్లాడుతూ తమ కార్యకలాపాలన్నీ పూర్తిగా చట్టబద్ధంగానే కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. 2016-17 సంవత్సరాల్లో రైతుల నుంచి సుమారు 450 ఎకరాల భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని తెలిపారు. అనంతరం 2019లో సర్వే నంబర్ 322 పరిధిలో డీటీసీపీ అనుమతులతో లేఅవుట్ అభివృద్ధి చేపట్టినట్లు చెప్పారు. భూమిలో రాయి అధికంగా ఉండటంతో అభివృద్ధి పనుల కోసం బ్లాస్టింగ్ అవసరమైందని వివరించారు. 2021లో ఇండస్ట్రీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మైనింగ్, ఎలక్ట్రిసిటీ శాఖల నుంచి అన్ని అనుమతులు తీసుకుని క్రషర్ యూనిట్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. మైనింగ్ శాఖకు రాయల్టీలు కూడా క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయ కారణాలతోనే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అధికారుల విచారణకు పూర్తిగా సహకరిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

012409
Total views : 75000

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.