మండు వేసవి మొదలైతే చాలు… గోదావరి ఒడ్డున ఉన్న పల్లెల్లో ప్రజలకు తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం మండలాల్లో మంచినీటి సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రజలకు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో పైపులైన్లు పగిలిపోవడం, రోజులు గడిచినా మరమ్మతులు చేయకపోవడం, రెండు రోజులకోసారి మాత్రమే నీటి సరఫరా జరగడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా మారుమూల ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మిషన్ భగీరథ నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియక మహిళలు, చిన్నారులు గంటల తరబడి బిందెలతో ఎదురు చూడాల్సి వస్తోంది. మరోవైపు అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తలపైనే గోదావరి ప్రవహిస్తున్నా గొంతు తడవని గ్రామాల దుస్థితిపై సివిఆర్ న్యూస్ ప్రత్యేక కథనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక నియోజకవర్గ ప్రజలు ప్రస్తుతం తీవ్రమైన తాగునీటి సమస్యతో సతమతమవుతున్నారు. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మించిన మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని అనేక మండలాలకు మంచినీరు అందించాలని ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందించింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ పైపులైన్లు పగిలిపోవడం, నీటి ఒత్తిడి తగ్గిపోవడం, సరఫరా అంతరాయం కలగడం వల్ల గ్రామాల్లో ప్రజలు బోర్లు, వ్యవసాయ బావులపై ఆధారపడాల్సి వస్తోంది. ఎండలు తీవ్రంగా ఉండటంతో భూగర్భజలాలు కూడా అడుగంటిపోతున్నాయి. దీంతో తాగునీటి కోసం మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో నీటి కోసం జనం క్యూలు కట్టడం సాధారణ దృశ్యంగా మారిపోయాయి. అధికారులు తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టుకుంటున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పైపులైన్లు మరమ్మతు చేసి, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
గోదావరి నది పక్కనే నివసిస్తున్న ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నామని ప్రజలు వాపోతున్నారు . ఒకప్పుడు జీవనాధారంగా నిలిచిన గోదావరి జలాలు తగ్గిపోవడంతో పాటు మిషన్ భగీరథ సరఫరా కూడా సక్రమంగా లేకపోవడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా కరకగూడెం, మణుగూరు, అశ్వాపురం మండలాల్లో గ్రామాల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. గ్రామాల్లో రెండు మూడు రోజులకోసారి మాత్రమే నీరు రావడంతో ప్రజలు తాగునీటిని నిల్వ చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. పైగా సరఫరా అయ్యే నీరు సరిపోక బావులు, బోర్ల నుంచి నీరు తెచ్చుకుని వినియోగిస్తున్నారు. మరో వైపు సాధ్యమైనంత వరకు ప్రజలకు తాగునీటిని అందిస్తున్నామని మిషన్ భగీరథ ఏ ఈ తెలిపారు .
అయితే కోట్ల రూపాయలతో నిర్మించిన మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్వహణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పగిలిపోయిన పైపులైన్లను వెంటనే మరమ్మతు చేసి, ట్యాంకర్ల ద్వారా అత్యవసర నీటి సరఫరా చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల దాహార్తి తీర్చడంలో అధికార యంత్రాంగం ఎందుకు విఫలమవుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.




Total views : 81759