అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో ఉపాధి హామీ కూలీల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. మండుటెండల్లో కాలువల వద్ద పనులు చేస్తున్న కూలీలకు కనీస సదుపాయాలు కూడా కల్పించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లోని అనేక గ్రామాల్లో తాగునీరు, విశ్రాంతి షెడ్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వంటి ప్రాథమిక సదుపాయాలు లేకుండా కూలీలు పనులు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళా కూలీలు తమ ఇళ్ల నుంచే వాటర్ బాటిల్స్ తీసుకువచ్చే పరిస్థితి నెలకొంది. మండే ఎండల్లో గంటల తరబడి శ్రమిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూలీల సంక్షేమం కోసం అమలు చేస్తున్నామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. తక్షణమే అధికారులు స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు.
అమలాపురం నియోజకవర్గంలోని కామనగరువు పంచాయతీలో జరిగిన ఘటన ఉపాధి హామీ పనుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.ఒక కాలువలో పని చేస్తున్న సమయంలో ఓ మహిళ కూలీ ప్రమాదవశాత్తు గాయపడింది . తీవ్ర రక్తస్రావం జరిగినా, అక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా లేకపోవడంతో తోటి మహిళా కూలీలు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదాలు జరిగితే కనీస చికిత్స అందించే పరిస్థితి లేకపోవడంపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పని ప్రదేశాల్లో తాగునీరు, వైద్య సహాయం, భద్రతా చర్యలు తప్పనిసరి అయినప్పటికీ వాటిని అమలు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. గాయపడిన మహిళను స్వయంగా ఇతర కూలీలే ఎదో ఆకులతో వైద్యం చేసారు . దింతో కూలీల ఆరోగ్యం, భద్రతపై అధికారుల నిర్లక్ష్యం బయటపడిందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఉపాధి హామీ పనుల వద్ద కనీస సౌకర్యాలు కల్పించకపోతే ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధి హామీ పనుల అమలులో ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవహారశైలిపై కూడా కూలీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మస్టర్ ఫోటోలు తప్పనిసరి అంటూ తెల్లవారుజామునే పనులకు రప్పిస్తున్నారని, ఫోటో సరిగా రాకపోతే బిల్లులు ఆగిపోతాయని భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వేర్వేరు షిఫ్టులు పేరుతో కూలీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మహిళలు చెబుతున్నారు.ఎదో ఒక సాకు చెప్పి భయపెడుతున్నారని కూలీలు వాపోతున్నారు . డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ప్రకటిస్తున్నప్పటికీ, గ్రామ స్థాయిలో మాత్రం పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయని కూలీలు అంటున్నారు. పని ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం, పర్యవేక్షణ లోపించడం వల్ల ఉపాధి హామీ పథకం లక్ష్యాలు దెబ్బతింటున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కూలీలకు గౌరవప్రదమైన పని వాతావరణం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.





Total views : 75044