తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాట నిలబెట్టుకున్నారు. వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడుతూ, సామాన్యులకు ట్రాఫిక్ కష్టాలు ఉండకూడదని ఆయన తీసుకున్న నిర్ణయం నేడు ఆచరణలోకి వచ్చింది. నిన్ననే డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం, ఈరోజు స్వయంగా సాధారణ ట్రాఫిక్‌లోనే ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు.ముఖ్యమంత్రుల కాన్వాయ్ వెళ్తుందంటే చాలు.. గంటల తరబడి ట్రాఫిక్ నిలిపివేయడం, సామాన్యులు అల్లాడిపోవడం మనం నిత్యం చూసేదే. అయితే తెలంగాణలో ఇప్పుడు కొత్త సంప్రదాయం మొదలైంది. తన కాన్వాయ్ కోసం సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
ఈ క్రమంలోనే ఈరోజు శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసానికి వెళ్లే సమయంలో సీఎం కాన్వాయ్ రెగ్యులర్ ట్రాఫిక్‌లోనే ప్రయాణించింది. ఎక్కడా వాహనాలను నిలిపివేయకుండా, ట్రాఫిక్ పోలీసులు కేవలం ఒక లేన్‌ను మాత్రమే కాన్వాయ్ కోసం కేటాయించి, మిగిలిన లేన్లలో సామాన్య వాహనాలను అనుమతించారు. దీంతో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండానే సీఎం ప్రయాణం సాగింది. ఇచ్చిన మాట ప్రకారం ప్రజా పాలన అంటే ఇలాగే ఉంటుందని రేవంత్ రెడ్డి నిరూపించారంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Tag:




Total views : 89163