ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం ఆదివారం రాత్రి 1 గంట సమయంలో భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం స్థానికులను కలవరపరిచింది. అయోధ్యకు ఉత్తరాన 215 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు ఎన్ఎస్సీ వెల్లడించింది. ప్రాణ, ఆస్తి నష్టం ఏమీ నమోదు కాలేదు. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 1 గంట 7 నిమిషాలకు ఇది సంభవించిందని, అక్షాంశం: 28.73, పొడవు: 82.26, లోతు: 10 కి.మీ అని వివరాలు వెల్లడించింది. కాగా శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర భూకంపం నేపాల్‌ను వణికించిన విషయం తెలిసిందే. పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. ఈ ప్రకంపనలు భారత్‌లోని ఢిల్లీ రాజధాని ప్రాంతం, ఉత్తర భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిపించిన విషయం తెలిసిందే.
భూకంపం
నేపాల్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. జార్కోట్ జిల్లాలో లాబిదండా ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్సీ స్మాలజీ గుర్తించింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత కలిగిన ఈ భూకంపం ధాటికి అనేక ఇళ్లు, భవంతులు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకుని ఇప్పటివరకూ 60కిపైగా మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభావిత ప్రాంతంలోని శిథిలాల కింద ఉన్న వారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, భూకంప ప్రభావం ఢిల్లీతో పాటూ ఉత్తరాదిన పలు ప్రాంతాల్లోనూ కనిపించింది. భూకంపం రాత్రి వేళ సంభవించడంతో జరిగిన నష్టంపై పూర్తి సమాచారం ఇప్పుడే ఇవ్వలేమని నేపాల్ అధికారులు తెలిపారు. ఘటనపై వెంటనే స్పందించిన నేపాల్ ప్రభుత్వం అత్యవసర, విపత్తు నిర్వహణ సిబ్బంది, భద్రతా దళాలను రంగంలోకి దింపింది. భారత భూఫలకం, యూరేసియా ఫలకం కలిసే ప్రదేశంలో నేపాల్ ఉండటంతో ఇక్కడ భూకంపాలు నిత్యం సంభవిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.





Total views : 89300