వీకెండ్ వచ్చిందంటే చాలు యువత రెచ్చిపోతున్నారు. హైదరాబాద్‌లో రేసులతో హంగామా సృష్టిస్తున్నారు. తాజాగా రాత్రి రాయదుర్గం పరిధిలో కార్లు, బైకులతో రేసింగ్ చేశారు. వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నించిన పోలీసులపైకే దూసుకొచ్చారు. దీంతో పోకిరీలను అదుపులోకి తీసుకుని కారును స్టేషన్ కు తరలించారు. మరికొందరు యువకులు పరారవగా..పట్టుబడిన యువకులపై కేసులు నమోదు చేశారు. గతంలోనూ అనేకసార్లు హైటెక్ సిటీలో యువకులు కార్లు, బైక్ రేసింగ్‌కు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. పలుమార్లు హెచ్చరించినా వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చినా యువకుల తీరులో మార్పు మాత్రం రావడంలేదు. ముఖ్యంగా వీకెండ్స్‌లో యువకులు రేసింగ్‌లతో రెచ్చిపోతున్నారు. ఈ రేసింగ్‌లో పాల్గొనేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చేస్తున్నారు. ఈ రేసింగ్‌లతో వాహనదారులు, ప్రజలు భయపడిపోతున్నారు.
నగర శివారులోని సాఫ్ట్వేర్ ఐటీ హబ్ ప్రాంతాలు వేదికగా యువకులు హల్చల్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కార్లు, బైక్‌లతో బీభత్సం సృష్టిస్తూ స్థానికులు, వాహనదారులను భయాందోళనకు గురి చేస్తున్నారు. అర్ధరాత్రి నాలెడ్జి సిటీ ప్రాంతంలో కొందరు యువకులు భారీ శబ్దాలు వచ్చేలా ఏర్పాటు చేసుకున్న సైలెన్సర్లతో కార్లు, బైకులను వేగంగా నడుపుతూ హల్చల్ చేశారు. టీ-హబ్, ఐకియా ప్రాంతాల్లో రోడ్లపై రేసింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న హోండా సిటీ కారును పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. అయితే, కారు డ్రైవర్ ఆపకుండా పోలీసులపైకి దూసుకెళ్లాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు.. ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. హోండా సిటీ కారుతో పాటు సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన మిగిలిన రేసర్లు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.






Total views : 89157