పేదల కడుపు నిండినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, ఎంత అభివృద్ధి సాధించినా పేదలకు పట్టెడన్నం లేకపోతే అది వృధా అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అన్నార్తుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని ధరణికోటలో ఏర్పాటు చేసిన గ్రామీణ అన్న క్యాంటీన్‌ను ఆయన కార్మికులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా 5 రూపాయలు ఇచ్చి టోకెన్ కొనుగోలు చేసి, అక్కడి కార్మికులతో కలిసి భోజనం చేశారు. అంతకుముందు, క్యాంటీన్‌కు వచ్చిన పేదలకు, కార్మికులకు ఆయనే స్వయంగా వడ్డించారు.
పేదవాడి ఆకలి తీర్చడానికే ప్రజా ప్రభుత్వం అన్న క్యాంటీన్లు తెచ్చిందని, ఎన్టీఆర్ 2రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి ఆహార భద్రతకు నాంది పలికారన్నారు. అదే స్ఫూర్తితో సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. 2024లో అధికారంలోకి రాగానే తొలుత పట్టణాల్లో, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. కొత్తగా 62 గ్రామీణ క్యాంటీన్లు ప్రారంభం కావడంతో, రాష్ట్రంలో మొత్తం క్యాంటీన్ల సంఖ్య 269కి చేరిందని, త్వరలో మరో 5 సిద్ధమవుతాయని వివరించారు.
అన్న క్యాంటీన్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రోజూ 2.10 లక్షల మంది ఆకలి తీర్చుకుంటున్నారని, దీనికోసం ప్రభుత్వం రోజుకు 54 లక్షలకు పైగా ఖర్చు చేస్తోందని సీఎం తెలిపారు. నాణ్యమైన భోజనం అందించడంలో అక్షయపాత్ర ఫౌండేషన్ సేవలను ఆయన అభినందించారు. కొత్తగా ప్రారంభించిన క్యాంటీన్ల నిర్మాణానికి 43 కోట్లు, వాటి నిర్వహణకు ఏడాదికి అదనంగా 58 కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత పాలకులు అన్న క్యాంటీన్లను మూసేసి పేదల పొట్టగొట్టారన్నారు. వారికి విధ్వంసం, హింస, కూల్చడం మాత్రమే తెలుసునని…. అందుకే ఆ పార్టీ పేరును గొడ్డలి పార్టీగా మార్చుకోవాలన్నారు. ఒక రాజకీయ పార్టీగా ఉండే అర్హతను వైసీపీ కోల్పోయిందని ఆయన వ్యాఖ్యానించారు.




Total views : 90010