తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై చర్చ జోరందుకుంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. పశ్చిమ బెంగాల్ తరహాలోనే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగరడం ఖాయమని మోదీ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అవినీతి, కాంగ్రెస్ అసమర్థ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని, ప్రజలు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మోదీ సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలకు తెరలేపింది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతమైన బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిని తెలంగాణలో కూడా అమలు చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ మొదలైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశముందనే చర్చలు సాగుతున్నాయి.
()
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాల్లో కూడా కూటమి చర్చలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి ఎన్నికల బరిలో దిగితే జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని స్థానిక నాయకులు అంచనా వేస్తున్నారు. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు వంటి నేతలు కూటమి ఏర్పడితే తమ రాజకీయ భవిష్యత్తుకు కొత్త దారులు తెరుచుకుంటాయని భావిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియతో పాటు పలు నియోజకవర్గాల్లో ఉన్న డాక్టర్లు, ఇంజినీర్లు, వ్యాపారవేత్తలు కూడా కూటమి తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. రాజకీయంగా స్థబ్దుగా ఉన్న పలువురు నేతలు మోదీ సభ తర్వాత మళ్లీ చురుకుగా మారారని చెబుతున్నారు. ముఖ్యంగా యువత, ఉద్యోగ వర్గాలు, మధ్యతరగతి ప్రజల్లో కూటమి పట్ల ఆసక్తి పెరుగుతోందని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. దీంతో జిల్లాలో రాబోయే రోజుల్లో మరిన్ని రాజకీయ మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
భద్రాద్రి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు బలమైన పునాది ఉండేది. ఉమ్మడి రాష్ట్ర కాలంలో బూర్గంపాడు, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాల్లో టీడీపీకి గట్టి క్యాడర్ ఉండేది. డీలిమిటేషన్‌కు ముందు బూర్గంపాడు నుంచి తాటి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేగా గెలవగా, ఇల్లందులో ఊకే అబ్బయ్య విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా 2018 ఎన్నికల్లో అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఈ నేతలు బీఆర్ఎస్‌లో ఉన్నప్పటికీ, కూటమి రాజకీయాలు వేగం పుంజుకుంటే మళ్లీ పాత రాజకీయ బంధాలు పునరుద్ధరించబడే అవకాశముందని ప్రచారం సాగుతోంది. అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లందు వంటి నియోజకవర్గాల్లో టీడీపీ బలమైన ఓటు బ్యాంక్ ఇప్పటికీ ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి బీజేపీ, జనసేన క్యాడర్ తోడైతే కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇవ్వొచ్చని కూటమి వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూటమి ప్రభావం పెరిగే అవకాశముందని చర్చ జరుగుతోంది.
శ్రీరాముడు కొలువైన భద్రాచలం నియోజకవర్గంపై కూడా బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. హిందుత్వ, సెంటిమెంట్ రాజకీయాలను ప్రధాన అజెండాగా తీసుకుని భద్రాచలంలో బీజేపీ బలపడే ప్రయత్నాలు చేస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో కొత్తగూడెంలో జనసేన, అశ్వారావుపేట, పినపాక, ఇల్లందు ప్రాంతాల్లో టీడీపీ బరిలో ఉంటే కూటమి జిల్లాలో కీలక శక్తిగా మారే అవకాశముందని అంచనాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కూటమి ఎదిగేలా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఆశావాహులు, వ్యాపారవేత్తలు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఉన్నత స్థాయి ఉద్యోగులు కూడా టికెట్ల కోసం లాబీయింగ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మోదీ సభ తర్వాత జిల్లాలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిందని స్థానిక నాయకులు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల నాటికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాల్లో కూటమి ఎంత ప్రభావం చూపుతుందో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.





Total views : 89971