దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్‌ను హీరో రాకింగ్ మనోజ్ మంచు, తన సతీమణి భూమా మౌనికతో కలిసి సందర్శించారు. ఈ క్రమంలో దాసరి ఘాట్ దుస్థితిపై యాంకర్ గౌతమి షేర్ చేసిన వీడియోపై మనోజ్ రియాక్ట్ కావటమే కాకుండా స్వయంగా ఆ ప్రదేశాన్ని సందర్శించి, శుభ్రపరిచే కార్యక్రమాలను ప్రారంభించారు. దాసరి పట్ల తనకున్న గౌరవాన్ని, ప్రేమను చాటుకున్నారు. ఈ సందర్భంగా…
‘రా కింగ్’ మనోజ్ మంచు మాట్లాడుతూ ‘‘ఈరోజు మన గురువుగారు దాసరి నారాయణరావుగారి వర్ధంతి. నిజానికి ఈరోజు ఆయన వర్ధంతి అనే విషయం నాకు గుర్తు లేదు. నాలుగు రోజుల క్రితం చిత్రపురి కాలనీ వైపు వస్తుంటే, గురువుగారి విగ్రహం చూసి ఫ్యామిలీని గుర్తు చేసుకున్నాను. వెంటనే అరుణ్ అన్నకు ఫోన్ చేసి ఆలం అక్క నెంబర్ మారి పోయుంటే తీసుకున్నాను. వారితో మాట్లాడాను. ఎందుకనో దాసరిగారు గుర్తుకు వస్తున్నారని కూడా అన్నాను. ఈలోగా వేరే పనిలో పడి విషయం మరచిపోయాను. అది జరిగి నాలుగు రోజులు కూడా కాకముందే నిన్న సాయంత్రం గురువుగారు ఘాట్‌కు సంబంధించిన వీడియో చూడగానే చాలా బాధేసింది. వెంటనే స్పందించాను. నా టీమ్‌కు చెప్పాను. నేను ఆలస్యంగా చెప్పినా కూడా దార్లో వాళ్లు కార్మిక సిబ్బందిని మా కార్లలోనే ఎక్కించుకుని వచ్చాం. యాదగిరి అన్నకు ఫోన్ చేస్తే అన్న తెల్లవారు జామునే స్పందించారు. అలాగే ఎమ్మెల్యేగారు కూడా వెంటనే స్పందించారు. నేను కాల్ చేసిన ఇరవై నిమిషాల్లోనే స్పందించారు. జెసీబీని అరెంజ్ చేశారు. అన్నీ ఏర్పాట్లు చేశారు. 20-25 మంది పని చేశాం. నా మాట మీద ఇక్కడకు వచ్చిన వారందరికీ వసతులను ఏర్పాటు చేసిన అందరికీ థాంక్స్. గురువుగారి గురించి చెప్పాలంటే గొప్ప డైరెక్టర్..గొప్ప యాక్టర్.. గొప్ప స్క్రీన్ ప్లే రైటర్.. డైలాగ్స్, ఎడిటింగ్.. ఇలా 24 శాఖలపై ఆయన రాణించారు. ఆయన నా తండ్రి సమానులు. మా గురువుగారు. ఆయన్ని, పద్మ అంటీని ఎప్పుడూ మిస్ అవుతుంటాను. వాళ్లు లేని లోటు మాకు..ముఖ్యంగా నాకు బాగా తెలుస్తోంది. దాసరిగారి గురించి చెప్పాలంటే ఆయన డైరెక్షన్‌లో రూపొందిన నా మొగుడు నాకే సొంతం సినిమాలోయాక్ట్ చేశాను. అలాగే పుణ్యభూమి నాదేశం సినిమాలో ఆయనతో కలిసి నటించే భాగ్యం దక్కింది. మ్యూజిక్, ఎడిటింగ్ వర్క్స్ జరిగేటప్పుడు ఆయనతో పాటు వెళ్లేవాడిని. నాకు కూడా సినీ క్రాఫ్ట్ మీద ఇంత పిచ్చి, ఆసక్తి, ప్రాణం ఉందంటే మా నాన్నగారితో పాటు గురువుగారికే ఆ క్రెడిట్ దక్కుతుంది. గురువుగారు ఓ ఇన్‌స్టిట్యూట్. ఆయన మనకు ఓ దారి చూపించారు. ముఖ్యంగా ఆయన తీసిన సినిమాలు. సామాజిక సినిమాలు, కమర్షియల్ సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు. దాసరిగారి పని అయిపోయిందని అనుకునే సమయంలో ఓ కొత్త రకమైన సినిమాతో మన ముందుకు వచ్చేవారు. కమర్షియల్, మేల్ డామినేషన్ ఉన్న సమయంలో విజయశాంతిగారితో ఒసేయ్ రాములమ్మ అనే సినిమా తీసి.. ప్రతీ హీరోకి భయం పుట్టించారు. ఆమెను కమర్షియల్ హీరో రేంజ్‌కు తీసుకొచ్చారు. ఆయన ఇచ్చిన సామాజిక సందేశాలు కానీ.. డ్రామా ఇలా ప్రతీ ఒక్కటి డిఫరెంట్. ఈరోజు మనం థియేటర్స్ సమస్యలంటూ మాట్లాడుకుంటున్నాం.ఇబ్బంది పడుతున్నాం. కానీ నాకు తెలిసి దాసరి నారాయణరావుగారు ఎప్పుడో దీనికి సంబంధించి మార్గం చూపించారు. ఆయన మూవీ మిషన్. ఒక సంవత్సరానికి పది నుంచి పదిహేను సినిమాలు చేసేవారు. ఎందుకలా చేస్తున్నారంటే.. ఓ సినిమా చేస్తే ఎంత మందికి ఎలా ఉపాధి కలుగుతుంది.. థియేటర్స్‌కు రెగ్యులారిటీ ఇవ్వకపోతే.. జనాలు థియేటర్స్‌కు వచ్చే అలవాటు తప్పుతుంది. ఎప్పుడో ఓ సినిమా చేయటం కాదు.. ఎప్పుడూ సినిమా చేయాలని చెప్పారు. నాతో పాటు నాతోటి హీరోలందరూ సినిమాలు చేయటానికి ఎంతో కష్టపడుతున్నారు. అందరం వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలి. ఆ బాధ్యత అందరిపై ఉంది. నా చేతుల మీద ఇలా జరగటం నా ఆశీస్సులుగా భావిస్తున్నాను. ఈ ఏడాది తిథి ప్రకారం చూస్తే ఆయన వర్ధంతి జూన్ 20న వచ్చింది. కాబట్టి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ వెయిట్ చేస్తున్నారని తెలిసింది. ఇందులో ఎవరినీ తప్పు పట్టటానికి లేదు. నా దృష్టికి తీసుకొచ్చిన గౌతమిగారికి థాంక్స్. దాసరిగారున్నంత వరకు ఏ సమస్య ఉన్నా దాసరిగారు సమాధానంగా కనిపించారు. ఆయన తర్వాత ఆయనలా అన్నీ శాఖలపై పట్టున్నవారు అరుదయ్యారు. అందుకనే దాసరిగారు యుగానికి ఒక్కడనే చెప్పాలి. దాసరిగారిని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. దాసరిగారు, అంటీగారి ఇంట్లో ఎప్పుడూ మనుషులతో కోలహలం ఉండేది. దాసరిఘాట్‌ను పార్క్‌లా కాకుండా చుట్టు పక్కల పిల్లలు ఆడుకునేలా ఏదైనా యాక్టివేషన్ చేస్తే బావుంటుందని నా కోరిక. అది జరగాలని కోరుకుంటున్నారు. దాసరిగారు, పద్మగారిని ఎంతో మిస్ అవుతున్నాను. వారి ఆత్మలు ఎక్కడున్నా శాంతించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
భూమా మౌనిక మంచు మాట్లాడుతూ ‘‘ఈరోజు పెద్దలు దాసరి నారాయణరావుగారి వర్దంతికి ఇక్కడకు వచ్చాం. పెద్దాయన ఆత్మ ఎక్కడున్నా శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాసరి గారంటే సినీ ఇండస్ట్రీకి, పబ్లిక్ సర్వీస్‌కు బాగా తెలిసిన వ్యక్తి. వారు తీసిన ఎన్నో సినిమాల్లో ఎన్నో సోషల్ మెసేజ్‌లు ఇచ్చారు. ఎంతో మందిని ఇన్‌స్పైర్ చేశారు. అసమానతలపై సినిమాలతో గొంతెత్తారు. ఆయన వర్ధంతికి ఇక్కడకు రావటం మా బాధ్యత. పెద్దాయన మనోజ్‌ను పిలిపించుకుని ఈ పని చేయించుకున్నారనిపిస్తోంది. మనోజ్‌గారు ప్రతీ సందర్భంలో దాసరిగారిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. మనోజ్‌కు ఆయనెంతో ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం’’ అన్నారు.




Total views : 90087