ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం డీఏను, 2024 జులై 1 నుంచి 2.73 శాతం డీఏను అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
2025 జనవరి నుంచి అమలు కానున్న 1.82 శాతం డీఏకు సంబంధించిన 20 నెలల బకాయిలను 2028లో నాలుగు విడతల్లో చెల్లించనున్నారు. జనవరి, మార్చి, మే, జులై నెలల్లో ఈ బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అలాగే 2024 జులై నుంచి అమలు కానున్న 2.73 శాతం డీఏకు సంబంధించిన 26 నెలల బకాయిలను 2027లో నాలుగు విడతల్లో చెల్లించనున్నారు.
2027లో ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబరు నెలల్లో 2.73 శాతం డీఏ బకాయిలను చెల్లించనున్నట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. పింఛనుదారులకు కూడా ఇదే షెడ్యూల్ ప్రకారం డీఏ బకాయిలు చెల్లించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఉద్యోగులు, పింఛనుదారులకు సెప్టెంబరు జీతంతోనే పెరిగిన డీఏ ప్రయోజనం అందనుంది.