Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Latest News కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

by CVR NEWS
కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం

సముద్ర గర్భం కుచించుకుపోతోంది. నానాటికీ మడ అడవులు అంతరించిపోతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర గర్భంలో పాతి పెడుతూ భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఈ దొంగలు సాగిస్తున్న అరాచకాలతో పర్యావరణం పెను ప్రమాదంలో పడుతోంది. కృష్ణా జిల్లా బందరు రూరల్‌ మండలం పెదపట్నం గ్రామపంచాయతీ పరిధిలోని 181, 182/1, 182/2, 155/A, 155/B లలో సుమారు 40 ఎకరాల అసైన్డ్, దిబ్బ, ఫారెస్ట్ భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయి. ఆక్రమణదారులు సముద్రానికి రక్షణగా ఉన్న మడ అడవులు నరికివేసి ఆ భూముల్లో చేపల చెరువులు తవ్వారు. ఆ ప్రాంతంలో తమకున్న 16 సెంట్ల భూమిని సాకుగా చూపుతూ ఈ భూకబ్జాకు పాల్పడినట్లు సమాచారం..

సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనల ప్రకారం సముద్రానికి 500 మీటర్ల లోపు ఎలాంటి ఆక్రమణలకు పాల్పడకూడదు. మడ అడవులు నరకడం, భూముల ఆక్రమించి చెరువులు తవ్వడం, పర్యావరణానికి విఘాతం కలిగించడం, వన్యప్రాణులకి నష్టం కలిగించే చర్యలు చేపట్టడం చట్టరిత్యా కఠిన నేరం. కానీ పెదపట్నంలో కబ్జాదారులు ఇవేవీ లెక్కచేయడం లేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, CRZ నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కుతున్నారు…

పెదపట్నంలో భూముల ఆక్రమణ, మడ అడవులు నరికి చెరువులు తవ్విన ఘటనపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ జోన్ వన్ నిబంధనలకు వ్యతిరేకంగా అధికారుల అండదండలతో 40 ఎకరాలు ఆక్రమించారని మచిలీపట్నానికి చెందిన న్యాయవాది GV రమణ జిల్లా కలెక్టర్ బాలాజీ ని కలిసి ఫిర్యాదు చేశారు. అంగర రంగనాథ్, అంగర రామ్మోహన్ రావు, అంగర వెంకట నవీన, అంగర రమాదేవి, అంగర రజిని, అంగర అరుణ్ కుమార్ ఈ దారుణాలకు పాల్పడ్డారని… బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుని సహకరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు చేపట్టి భూములు స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు…

అడ్డగోలుగా చేపల చెరువులు తవ్వడంతో సముద్ర తీరం వెంబడి ఉన్న గ్రామాల పరిస్థితి దినదిన గండంగా మారుతోంది. కొందరు స్వార్థపరుల ధనదాహం వల్ల ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని.. వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని… కబ్జాదారులను కఠినంగా శిక్షించాలని తీర ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: