అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనా చర్య దురుద్దేశపూరితమంటూ మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో విడదీయలేని అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. కల్పిత పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాలను మార్చలేరని స్పష్టం చేసిన భారత విదేశాంగ శాఖ..ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బ తీసే చర్యలకు దూరంగా ఉండాలని హితవు పలికింది. ‘‘తప్పుడు వాదనలు, నిరాధార కథనాల సృష్టిని చైనా మానుకోవాలని.. అరుణాచల్ సహా ఈ ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌లో భాగంగానే ఉంటాయని తేల్చిచెప్పింది. చైనా చర్యలు ఈ వాస్తవాన్ని ఎప్పటికీ, ఏమాత్రమూ మార్చలేవని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
భారత సార్వభౌమత్వమున్న అక్సాయ్‌చిన్‌లో చైనా కొత్త కౌంటీని ఏర్పాటుచేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది భారత్. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ , అఫ్గానిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని షింజియాంగ్ ప్రావిన్స్‌లో సెన్లింగ్ పేరుతో చైనా ఈ కౌంటీని ఏర్పాటు చేసింది. భారత భూభాగంలోని ప్రాంతాలకు కల్పిత పేర్లు పెట్టడంద్వారా చైనా సృష్టిస్తున్న అబద్ధపు కథనాలు ఏమాత్రం చెల్లవని విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని..భవిష్యత్తులోనూ అది భారత్‌లో భాగంగానే ఉంటుందని వెల్లడించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఇలాంటి చర్యలు అడ్డంకిగా మారుతున్నాయని అభిప్రాయపడింది.





Total views : 89713