దేశంలో చక్కెర కొరత అంశంపై రాజకీయ దుమారం రేగుతోంది. చక్కెర కొరతకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారీ స్థాయిలో చెరకును ఇథనాల్ తయారీకి మళ్లించడం వల్లే దేశంలో చక్కెర ఉత్పత్తిపై ప్రభావం పడిందని ఆరోపించారు. దాదాపు 30 లక్షల టన్నుల చెరకును ఇథనాల్ తయారీ కోసం వినియోగిస్తున్నారని, ఫలితంగానే మార్కెట్లో చక్కెర కొరత ఏర్పడుతోందని కేజ్రీవాల్ విమర్శించారు.
ఒకవైపు ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు భారంగా మారుతుండగా… మరోవైపు చక్కెర సరఫరాపై ఆందోళన నెలకొనడం ప్రభుత్వ విధానాల వైఫల్యానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా చెరకు వినియోగాన్ని ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. చక్కెర కొరత సమస్యపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి… సరఫరా, ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.