బాపట్ల నియోజకవర్గంలోని అడవి పంచాయతీ పరిధిలో ఉన్న సూర్యలంక బీచ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరు గాంచింది. కార్తీక మాసం, వారాంతాలు, పబ్లిక్ హాలిడేస్ రోజుల్లో కుటుంబ సమేతంగా వేలాదిమంది పర్యాటకులు ఇక్కడికి తరలివచ్చి సముద్రతీర అందాలను ఆస్వాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద రూ.97.52 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతో సూర్యలంక మరింత ఆకర్షణీయంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రిసార్ట్స్ సంఖ్య వేగంగా పెరుగుతోంది. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకార కుటుంబాలు ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తూ జీవనం సాగిస్తున్నాయి. అయితే గత ప్రభుత్వంలో ఇచ్చిన అనుమతుల మేరకు కొన్ని చోట్ల రిసార్ట్స్ నెలకొల్పారు .వీటిపై కేసులు నడుస్తున్నాయి . అభివృద్ధి ఒకవైపు కొనసాగుతుండగా, నియంత్రణ లేకపోవడం మరోవైపు సమస్యలకు దారి తీస్తోంది. పర్యాటక రంగం అభివృద్ధి చెందుతున్నప్పటికీ, దానితో పాటు వచ్చే సమస్యలను పరిష్కరిం చాల్సిన అవసరం కూడా ఉంది .
సూర్యలంకలో అనధికార రిసార్ట్స్ పెరుగుదల స్థానిక సమస్యలను మరింత తీవ్రతరం చేస్తోంది. మత్స్యకారులకు ప్రభుత్వం కేటాయించిన సెంటు, సెంటున్నర స్థలాలను కొంతమంది రిసార్ట్స్ యజమానులు అక్రమంగా కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నారు. ఈ రిసార్ట్స్‌లో గదులను గంటకు రూ.1000 నుంచి రూ.3000 వరకు అద్దెకు ఇచ్చి భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. దీంతో పర్యాటకులపై ఆర్థిక భారం పడటమే కాకుండా, స్థానిక ప్రజల జీవన విధానంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొంతమంది మత్స్యకార కుటుంబాలు కూడా తమ ఇళ్లను రిసార్ట్స్‌గా మార్చి అద్దె ఆదాయంపై ఆధారపడుతున్నారు. అంతేకాకుండా కొన్ని రిసార్ట్స్ అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితులు పర్యాటకుల భద్రతకు ముప్పుగా మారుతున్నాయి. అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ మార్పులు నియంత్రణలో లేకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
మరో వైపు అనధికార రిసార్ట్స్ వల్ల అడవి పంచాయతీకి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిపోతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పన్నులు, అనుమతులు లేకుండా నడుస్తున్న ఈ వ్యాపారాల వల్ల ప్రభుత్వానికి, పంచాయతీకి నష్టం కలుగుతోంది. అయితే అధికారులు మాత్రం ఈ సమస్యపై తగిన చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సూర్యలంక బీచ్ అభివృద్ధి చెందుతున్న తరుణంలో పర్యాటకుల రద్దీ పెరగడంతో రిసార్ట్స్ పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయి. దీనివల్ల పంచాయతీ ఆదాయం తగ్గడమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అనధికార నిర్మాణాలను నియంత్రించి, పంచాయతీకి సరైన ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటే మాత్రమే సూర్యలంక పర్యాటక కేంద్రంగా సుస్థిర అభివృద్ధి సాధించగలదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.





Total views : 90023