ప్రస్తుతం సువెందు అధికారి పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతుంది .దింతో అందరి దృష్టి సువెందు అధికారి పైనే వుంది .అసలు సువెందు అధికారి ఎవరు ? అయన చేసిందేంటి ? బీజేపీలో కీలక నేతగా ఎలా ఎదిగారు ? మమతా బెనర్జీ తో గొడవ ఎందుకు వచ్చింది ? మమతను గద్దె దించే వరకు నిద్రపోనని ఎందుకు శపధం చేసారు ? ఇప్పుడు ఇదే పెద్ద చర్చనీయాంశం గా మారింది . సువెందు అధికారి పశ్చిమ బెంగాల్ బీజేపీలో కీలక నేతగా ఎదిగిన నాయకుడు. మొదట్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో కొనసాగిన ఆయన, తరువాత విభేదాల కారణంగా పార్టీని వీడి బీజేపీలో చేరారు. డిసెంబర్ 15, 1970న పూర్బా మిద్నాపూర్ జిల్లాలో జన్మించిన సువెందు అధికారి రాజకీయ కుటుంబంలో పుట్టి పెరిగారు. ఆయన తండ్రి శిశిర్ అధికారి కూడా ప్రముఖ రాజకీయ నాయకుడు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది . 1995 నుంచి 1998 వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సువెందు అధికారి, తరువాత మమతా బెనర్జీతో కలిసి కాంగ్రెస్‌ను వీడి టీఎంసీలో చేరారు. ప్రారంభం నుంచే టీఎంసీలో కీలక పాత్ర పోషిస్తూ, గ్రౌండ్ లెవెల్లో బలమైన నాయకుడిగా ఎదిగారు. ఆయన రాజకీయ ప్రయాణం మొదటి దశలోనే ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకుని తనకు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
టీఎంసీలో కీలక నాయకుడిగా ఎదిగిన సువెందు అధికారి, 2009లో తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం 2016లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రభావాన్ని చాటుకున్నారు. టీఎంసీ ప్రభుత్వంలో రవాణా, నీటిపారుదల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా నందిగ్రామ్ భూసేకరణ వ్యతిరేక ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ ఉద్యమం ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ప్రజా సమస్యలపై నేరుగా స్పందించే నాయకుడిగా ఆయన పేరు సంపాదించుకున్నారు. అయితే కాలక్రమేణా టీఎంసీ నాయకత్వంతో విభేదాలు పెరగడంతో రాజకీయంగా కీలక మలుపు తీసుకున్నారు. 2020లో టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం ఆయన రాజకీయ జీవితంలో పెద్ద నిర్ణయంగా మారింది. ఈ పరిణామం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.
బీజేపీలో చేరిన తర్వాత సువెందు అధికారి మరింత దూకుడుగా రాజకీయాలు కొనసాగించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి మమతా బెనర్జీపై విజయం సాధించడం ద్వారా సంచలనం సృష్టించారు. ఈ విజయం ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకువచ్చింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బలమైన మాస్ లీడర్‌గా పేరుగాంచిన ఆయనకు గ్రౌండ్ లెవెల్లో మంచి పట్టుంది. కఠిన నిర్ణయాలు తీసుకునే నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మరోవైపు, తన రాజకీయ ప్రయాణంలో పలు వివాదాలను కూడా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పార్టీ మార్పు, టీఎంసీతో విభేదాలు రాజకీయ చర్చలకు దారి తీశాయి. అయినప్పటికీ, తనదైన శైలిలో రాజకీయాలను కొనసాగిస్తూ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రభావవంతమైన నాయకుడిగా కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సువెందు అధికారి , మమతా బెనర్జీ మధ్య విభేదాలు సాధారణ రాజకీయ విభేదాలు కాదు… అది అధికారం, వ్యక్తిగత ప్రతిష్టల పోరాటంగా మారింది. టీఎంసీలో తన ప్రాధాన్యం తగ్గిందన్న అసంతృప్తితో సువెందు అధికారి బయటకు వచ్చి బీజేపీలో చేరడం కీలక మలుపు. ప్రధానంగా టీఎంసీ లో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనెర్జీ పెత్తనం పెరగడంతో సువెందు అధికారి సహించ లేకపోయారు . నందిగ్రామ్ పోరాటంలో మమతా కన్నా ఎక్కువ పేరు సువెందు అధికారికి వచ్చింది .ఇది పార్టీలో ఒక వర్గానికి మింగుడు పడలేదు .దింతో సువెందు అధికారికి ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు . ఎక్కడ అయితే మమతా బెనెర్జీ తో కలిసి పోరాటం చేసారో అదే స్థానం నుంచి మమతాను ఓడించడం ద్వారా సువెందు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆయన పోరాట ధోరణి మాత్రం వాస్తవం. ప్రస్తుతం ఆయన బీజేపీకి బెంగాల్లో ప్రధాన ముఖచిత్రంగా మారారు. అయితే బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం అవుతారా అన్నది ఇంకా అనిశ్చితంగానే ఉంది . పార్టీ నిర్ణయం, రాజకీయ సమీకరణలు సీఎం ని నిర్ణయించడంలో కీలకంగా మారనున్నాయి . అయినప్పటికీ, భవిష్యత్తులో సీఎం రేసులో సువెందు అధికారి ప్రధాన పోటీదారుడిగా ఉండటం ఖాయం. మొత్తం మీద ఆయన రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు బీజేపీ అధినాయకత్వం పైనే ఆధారపడివుంది .






Total views : 75147