టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ను నియమించింది. ఇక ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ కొనసాగనున్నారు. పొలిటిబ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను కూడా ప్రకటించింది. 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీని కూర్చారు. జాతీయ కమిటీలో ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, 18 మంది ఉపాధ్యక్షులు,10 మంది అధికార ప్రతినిధులకు అవకాశం కల్పించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా రామ్మోహన్ నాయుడు, బైరెడ్డి శబరి, రాజేశ్ కిలారులను నియమించింది. అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని కమిటీల కూర్పుపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కసరత్తు చేశారు. సీనియర్లకు గౌరవమిస్తూ..కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ.. సామాజిక కోణంలో నూతన కమిటీల కూర్పు జరిగింది. విధేయత, కష్టపడే తత్వం, అనుభవం లెక్కించి అధిష్ఠానం పదవులు ఇచ్చింది. నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం కల్పించింది.
ఇక నూతన కార్యవర్గంలో చంద్రబాబు సామాజిక సమీకరణాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. మొత్తం 185 మందితో కూడిన రాష్ట్ర కమిటీలో 122 స్థానాలను బడుగు, బలహీన వర్గాలకే కేటాయించి సామాజిక విప్లవానికి తెరలేపారు. ఇందులో బీసీలకు 77, ఎస్సీలకు 25, ఎస్టీలకు 7, మైనార్టీలకు 13 స్థానాలు కల్పించారు. మొత్తంగా చూస్తే బీసీలకు 40 శాతం, ఎస్సీలకు 25 శాతం చొప్పున ప్రాతినిధ్యం లభించింది. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్తులో రాబోయే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ మరియు 33 శాతం మహిళా రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని మహిళలకు పెద్దపీట వేశారు. రాష్ట్ర కమిటీలో ఏకంగా 50 మంది మహిళలకు చోటు కల్పించారు. పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కిందిస్థాయి కార్యకర్తలకు అత్యున్నత గౌరవం దక్కింది. పార్టీ పొలిట్ బ్యూరోలో సామాన్య కార్యకర్తలను నియమించి చంద్రబాబు అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ మండల పార్టీ అధ్యక్షురాలిని నేరుగా పొలిట్ బ్యూరోలోకి తీసుకోవడం ద్వారా, పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత ఉంటుందని నిరూపించారు.
మొత్తంగా పార్టీ యంత్రాంగాన్ని కొత్త పుంతలు తొక్కించేలా ఈ నియామకాలు జరిగాయి. రాష్ట్ర కమిటీలో ఏడుగురు ప్రధాన కార్యదర్శులు, 16 మంది ఉపాధ్యక్షులు, 14 మంది అధికార ప్రతినిధులు, 10 మంది జోనల్ కో-ఆర్డినేటర్లను నియమించారు. వీటితో పాటు నాలెడ్జ్ కమిటీ, హెచ్ఆర్డీ కమిటీల్లో కూడా నియామకాలు పూర్తి చేశారు. సీనియర్ల అనుభవాన్ని, యువత ఉత్సాహాన్ని సమతుల్యం చేస్తూ రూపొందించిన ఈ కమిటీలు రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.





Total views : 90097