అమరావతిలో జరుగుతున్న టీడీపీ మహానాడుకు తొలిరోజే విరాళాలు వెల్లువెత్తాయి. పార్టీకి ఆర్థికంగా అండగా నిలుస్తూ పలువురు నేతలు భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించారు. ముఖ్యంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి 5 కోట్ల భారీ విరాళం ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. వీరి ప్రకటన మహానాడులో ప్రధాన హైలైట్‌గా నిలిచింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ క్లస్టర్ నెం.3 మహానాడులో పాల్గొనగా, ప్రశాంతి రెడ్డి మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలోని మహానాడులో పాల్గొన్నారు.
తొలిరోజు మహానాడు ముగిసేసరికి పార్టీకి సుమారు 12 కోట్ల విరాళాలు అందాయి. వేమిరెడ్డి దంపతుల తర్వాత ఎంపీ సానా సతీష్ 1.5 కోట్లు ప్రకటించారు. అలాగే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, భాష్యం రామకృష్ణ తలో కోటి రూపాయల చొప్పున విరాళం అందించారు. మరోవైపు, మహానాడులో ప్రవేశపెట్టిన పలు తీర్మానాలపై 48 మంది నేతలు ప్రసంగించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సూపర్ సిక్స్’ పథకాలు సూపర్ పవర్‌లా పనిచేస్తున్నాయని, దీనిని చూసి గొడ్డలి పార్టీ ఓర్వలేక దుష్ప్రచారం చేస్తోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆరోపించారు. మహానాడు కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ఏ పేదవాడి ఇంటికి వెళ్లి చూసినా సూపర్ సిక్స్ పవర్ తెలుస్తుందని ఆమె అన్నారు.
ప్రభుత్వ పథకాల అమలు తీరును వివరిస్తూ, తల్లికి వందనం కింద 67.27 లక్షల మంది విద్యార్థులకు 10 వేల 90 కోట్లు అందించామని, గత ప్రభుత్వం కేవలం 42 లక్షల మందికే ఈ పథకాన్ని పరిమితం చేసిందని తెలిపారు. “అన్నదాత సుఖీభవ” ద్వారా 46.85 లక్షల మంది రైతులకు 8 వేల 985 కోట్లు ఇచ్చామని, ఏడాదికి 20 వేల పెట్టుబడి సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని వివరించారు. స్త్రీశక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటివరకు 63 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. దీపం-2 ద్వారా 4 కోట్లకు పైగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామన్నారు. ప్రతినెలా ఒకటో తేదీన ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందిస్తుంటే లబ్ధిదారుల కళ్లలో ఆనందం కనిపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. యువగళం ద్వారా రాష్ట్రానికి 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి, 24 లక్షల ఉద్యోగాల కల్పనకు బాటలు వేశామని ప్రశాంతి రెడ్డి తెలిపారు. డీఎస్సీ నియామకాలు, పరిశ్రమల ఏర్పాటు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలతో యువతకు భవిష్యత్‌పై భరోసా కల్పిస్తున్నామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.





Total views : 89244