పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నీటి కాలుష్యం రోజు రోజుకీ తీవ్రమవుతూ స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పట్టణం మధ్యగా ప్రవహించే ప్రధాన కాలువ ఇప్పుడు కాలుష్యానికి కేంద్రబిందువుగా మారింది. గృహాల నుంచి వచ్చే మురుగు నీరు, పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలు నేరుగా కాలువలో కలుస్తున్నాయి. దీనికి తోడు ప్లాస్టిక్ చెత్త కూడా కలువలో వేస్తున్నారు . ఫలితంగా కాలువలోని నీరు నల్లగా మారి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. కాలువ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు రోజువారీ జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలో ఉండటం కూడా కష్టంగా మారిందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దోమలు విపరీతంగా పెరిగి, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత ప్రమాదకర స్థితి ఏర్పడే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నప్పటికీ సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై స్థానిక ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది . పలుమార్లు ఫిర్యాదులు చేసినా కాలువ శుభ్రపరిచే పనులు సక్రమంగా చేపట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. కాలువలోకి వచ్చే మురుగు నీటిని శుద్ధి చేయడానికి సరైన వ్యవస్థ లేకపోవడం సమస్య తీవ్రతను మరింత పెంచుతుంది . ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెంటనే కాలువను శుభ్రపరచడం, మురుగు నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం, పరిశ్రమల వ్యర్థాలపై కట్టుదిట్టమైన నియంత్రణలు అమలు చేయడం అవసరమని సూచిస్తున్నారు. లేకపోతే ఈ కాలుష్యం మరింత విస్తరించి పట్టణంలోని ఇతర ప్రాంతాలకూ ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
పాలకొల్లులో ప్రధాన కాలువ తీవ్ర కాలుష్య మయం ..
17
previous post




Total views : 56585