జిహెచ్ఎంసి పరిధిలోని మొత్తం చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కే తరలిస్తున్నారు . దింతో స్థానిక ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. నిబంధనల ప్రకారం చెత్తను శాస్త్రీయంగా ప్రాసెస్ చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, నిర్వహణలో తీవ్ర లోపాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా రాంకీ సంస్థ కేవలం చెత్తను పోగు చేయడానికే పరిమితమైందన్న ఆరోపణలు వస్తున్నాయి . డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న విషవాయువులతో పరిసర ప్రాంతాల ప్రజలను శ్వాసకోశ వ్యాధులు సోకుతున్నాయి . చిన్నపిల్లలు, వృద్ధులు మరింతగా ఇబ్బందులు పడుతున్నారు. గాలి, నీటి కాలుష్యం కారణంగా చర్మవ్యాధులు కూడా విస్తరిస్తున్నాయి. ఇంతటి ప్రమాదకర పరిస్థితి నెలకొన్నప్పటికీ, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యం కంటే కాంట్రాక్ట్ సంస్థల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది.
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “తాము మనుషులం… చెత్త మధ్య బ్రతకడానికి పుట్టలేదు” అంటూ ఆవేదన చెందుతున్నారు . నగరంలోని మొత్తం చెత్తను ఒకే ప్రాంతానికి తరలించడం వల్ల అక్కడి వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. చెత్తను వేరు చేసే విధానం పాటించకుండా, ఒకే డంపింగ్ యార్డ్‌పై ఆధారపడటం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని స్థానికులు అంటున్నారు . చెత్తను వర్గీకరించి రీసైక్లింగ్ చేయడం, శాస్త్రీయ ‘క్యాపింగ్’ పద్ధతులు అమలు చేయడం అత్యవసరం అని నిపుణులు సూచిస్తున్నారు . అదే సమయంలో బాధిత ప్రజలకు తక్షణ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందించాల్సిన అవసరం కూడా ఉంది. రాంకీ సంస్థ ఒప్పంద నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమగ్ర చర్యలు తీసుకోకపోతే, ఈ సమస్య మరింత తీవ్రమై పెద్ద ఆరోగ్య సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు .





Total views : 56517