అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన కోట్లు విలువ చేసే స్థలం వివాదాస్పదంగా మారింది. 1983లో సేకరించిన ఈ స్థలంలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం జరిగింది. అయితే కాలక్రమేణా బలిఘట్టం బైపాస్ రోడ్డు నిర్మాణంతో స్థలం రెండు భాగాలుగా విడిపోయింది. రోడ్డుకు అవతల పివిఆర్ కాంప్లెక్స్ నుంచి శారద నగర్ వరకు సుమారు 20 సెంట్ల స్థలం మిగిలింది. గతంలో అక్కడ నివసించిన కుటుంబాన్ని బలవంతంగా ఖాళీ చేయించారు .అక్కడ యూనియన్ కార్యాలయానికి కూడా అనుమతి నిరాకరించారు. కానీ ప్రస్తుతం అదే స్థలంలో ప్రైవేట్ యాజమాన్యాలు ఆక్రమణలకు పాల్పడుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మినీ శ్రీ కన్య థియేటర్ సమీపంలో ఉన్న ఆర్టీసీ రాయి తొలగించడంతో పాటు , ఎటిఎం సెంటర్ , బ్యాంక్ ముందు వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు .ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడం పై విమర్శలు వస్తున్నాయి .
ఇక అత్యంత వివాదాస్పద అంశం ఏంటంటే .. ఆర్టీసీ స్థలాల విక్రయం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్టీసీ స్థలాలను అమ్మకూడదు, అవసరమైతే లీజుకు ఇవ్వవచ్చు. కానీ నర్సీపట్నంలో అధికారులు దర్జాగా స్థలాలను అమ్మేశారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. రెండు స్థలాలు విక్రయించగా, మిగిలిన వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిన వారికి ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గతంలో ఆర్టీసీ స్థలాన్ని లీజుకు ఇవ్వడాన్ని కూడా అడ్డుకున్న సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు స్వేచ్ఛగా స్థలాల విక్రయానికి పాల్పడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు చర్యలు లేకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచుతోంది. వెంటనే ఆక్రమణలను తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.





Total views : 56517