హైదరాబాద్‌లో నేపాలీ ముఠాల నేరాలు రెచ్చిపోతున్నాయి. తాజాగా మరోసారి కలకలం సృష్టించింది మరో నేపాలీ గ్యాంగ్. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూరు గల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న డాక్టర్ దంపతుల ఇంట్లో ఓ ముఠా భారీ దోపిడీకి పాల్పడింది. డాక్టర్ విజయలక్ష్మి దంపతులను కట్టేసి ఇంట్లోని ఆభరణాలు, నగదును దోచుకెళ్లారు. ఇంట్లో పని చేసేవారే పథకం ప్రకారం ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో దుండగులు 60 తులాల బంగారం, వెండి వస్తువులు, 30 వేల నగదును దోచుకెళ్లారు.
డాక్టర్ విజయలక్ష్మి దంపతులు13 రోజుల క్రితమే నేపాల్‌కు చెందిన దంపతులను పనిలో పెట్టుకున్నారు. పనిమనిషి పుట్టినరోజు అని చెప్పి, కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు వారి స్నేహితులుగా మరో ఐదుగురిని ఇంటికి పిలిచారు. డాక్టర్ దంపతులు భోజనం చేస్తున్న సమయంలో ముఠా సభ్యులు ఒక్కసారిగా వారిపై దాడి చేసి, తాళ్లతో కట్టేశారు. మీకు కావాల్సింది తీసుకెళ్లండి, మమ్మల్ని చంపకండి అని బాధితులు వేడుకున్నా వినకుండా, వారికి మత్తుమందు ఇచ్చి ఓ గదిలో బంధించారు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారం, వెండి, నగదును దోచుకుని, సాక్ష్యాలు దొరక్కుండా సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసి పరారయ్యారు. నిన్న మధ్యాహ్నం స్పృహలోకి వచ్చిన దంపతులు కిటికీ నుంచి కేకలు వేయడంతో, చుట్టుపక్కల వారు వచ్చి వారిని రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. మల్కాజ్‌గిరి డీసీపీ సుమతి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.






Total views : 74954