దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పే ఒక అతిపెద్ద సంచలనానికి మోదీ సర్కార్ సిద్ధమవుతోందా? మీ ఇంట్లో.. అల్మారాల్లో.. లాకర్లలో పేరుకుపోతున్న బంగారం, ఇప్పుడు దేశానికి ఆర్థిక ఆయుధంగా మారబోతోందా..? అసలు ఏంటి ఈ గోల్డ్ మానిటైజేషన్ మాస్టర్ ప్లాన్? సామాన్యుడికి దీనివల్ల వచ్చే లాభమేంటి? భారత్ దిగుమతుల భారాన్ని తగ్గించే ఆ 2,000 టన్నుల మ్యాజిక్ ఏంటి..?
భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం కాదు, అది ఒక సెంటిమెంట్.. ఒక భరోసా. కానీ, ఆర్థిక భాషలో చెప్పాలంటే ఇది ఒక డెడ్ అసెట్. అంటే, అది ప్రజల దగ్గర బంగారం ఉన్నంత కాలం దాని విలువ పెరగొచ్చు కానీ, వినియోగదారులకు నెలనెలా ఎలాంటి ఆదాయాన్ని ఇవ్వదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా త్వరలో కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీని అందుబాటులోకి తేనుంది. తద్వారా ప్రజల దగ్గర ఉన్న బంగారంతో వడ్డీ వచ్చేలా ప్రతిపాదించనుంది. వినియోగదారులు వారి వద్ద ఉన్న కనీసం 10 గ్రాముల బంగారం ఉంటే బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు. గతంలో పెద్ద మొత్తంలో ఉన్నవారికే ఈ అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కేవలం 10 గ్రాముల బంగారం ఉన్నా ఈ స్కీమ్‌లో చేరే అవకాశం కేంద్రం కల్పించింది. డిపాజిట్ చేసిన బంగారంపై వార్షిక వడ్డీ రేటు సుమారు 2శాతం నుంచి 2.5శాతం వరకు పొందవచ్చు.
వాస్తవానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీంను 2015లో ప్రారంభించింది మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు బంగారం దిగుమతిని అడ్డుకోవడం, భారతీయుల దగ్గర నిరుపయోగంగా ఉన్న నిల్వ ఉన్న బంగారాన్ని వెలికి తీయడం వంటి రెండు అంశాలను దృష్టి పెట్టుకొని ఓ ప్రత్యామ్నాయ మార్గంగా భావిస్తున్నారు. ఈ స్కీంలో భాగంగా ప్రజలు, సంస్థల దగ్గర నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని సేకరించి ఉత్పాదక ప్రయోజకోసం ఉపయోగించేలా చేయడం, బంగారం దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రెండు రకాల స్కీంలు ఉన్నాయి. ఒకటి బంగారం డిపాజిట్ పథకం, రెండోది బంగారు లోహ రుణం. అప్పట్లో బంగారం సేకరించేందుకు ఇది ఒక గొప్ప ప్రయత్నంగా భావించబడినప్పటికీ, వినియోగదారులను ఆకర్షించడంలో విఫలమైంది. దేశ ప్రజలనుంచి 34వేల టన్నుల బంగారం సేకరించాలని టార్గెట్ పెట్టుకోగా కేవలం 39 టన్నుల బంగారం మాత్రమే సమీకరించగలిగింది.
భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గోల్డ్ ఇంపోర్టర్. ప్రతి సంవత్సరం సుమారు 700 నుంచి 800 టన్నుల బంగారం దిగుమతి అవుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో అయితే మన బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. అయిదు నెలల కాలంలో 24 శాతం పెరిగాయి. దీంతో దేశానికి సుమారు 72 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో విదేశీ మారకం నిల్వ తగ్గుదలను అడ్డుకునే యోచనలో భాగంగా గోల్డ్ మానిటైజేషన్ స్కీం మళ్లీ తెరపైకి వచ్చింది. పదేళ్లపాటు అమలులో ఉన్న ఈ స్కీంలో కొంత భాగం నిలిపివేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్ మానిటైజేషన్ స్కీంను పునరుద్దరించి బలోపేతం చేయాలని కేంద్రం భావిస్తోంది. అందుకే గతంలో ఉన్న ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌కు భారీ మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది.
ప్రస్తుతం దేశంలో ప్రజల వద్ద ఉన్న బంగారం సుమారు 30వేల టన్నులు ఉంటుందని ఓ అంచనా. దీన్ని వెలికితీసేందుకు ప్రధాని మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది. రూపాయి విలువను బలోపేతం చేయడానికి బంగారం దిగుమతులను తగ్గించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కనీసం 2,000 టన్నుల బంగారాన్ని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ 2,000 టన్నులు గనుక డిపాజిట్ అయితే, రాబోయే 3 ఏళ్ల పాటు భారత్‌కు బంగారం దిగుమతి చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. అయితే ఈ కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో స్పష్టత ఇవ్వనుంది.
ప్రజలు డిపాజిట్ చేసిన బంగారాన్ని బ్యాంకులు జువెలరీ తయారీ సంస్థలకు లేదా ఎగుమతి యూనిట్లకు లీజుకు ఇస్తాయి. దీనివల్ల మార్కెట్లో కొత్త బంగారం లభ్యత పెరుగుతుంది. డాలర్ వినియోగం తగ్గుతుంది. తద్వారా రూపాయి విలువ స్థిరంగా ఉంటుంది. అంతేకాకుండా కరెంట్ ఖాతా లోటు కూడా భారీగా తగ్గుతుంది. అయితే ఈ స్కీమ్ గతంలోనే అమల్లోకి తెచ్చినా..ఇది ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అందుకు చాలా కారణాలే ఉన్నాయి. వారసత్వంగా వచ్చిన బంగారాన్ని కరిగించడానికి ప్రజలు ఇష్టపడడంలేదు. అప్పట్లో వడ్డీ రేట్లు కూడా ఆకర్షణీయంగా లేవు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్కీమ్‌పై ప్రజల్లో అవగాహన లేదు.
అయితే ఈ పథకాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కేంద్రం ఈ సారి మరింత పకడ్బందీగా ముందుకు వెళ్తోంది. మెరుగైన వడ్డీ రేట్లు, డిజిటల్ ట్రాకింగ్, అధిక భద్రత, సులభతరమైన డిపాజిట్ ప్రక్రియ ద్వారా మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తోంది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాలని భావిస్తోంది. మొత్తానికి ప్రజల లాకర్లలో పేరుకుపోతున్న బంగారం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే, భారతీయులు తమ సెంటిమెంట్‌ను పక్కన పెట్టి బంగారాన్ని బ్యాంకులకు ఇస్తారా? మోదీ సర్కార్ తెస్తున్న ఈ కొత్త నిబంధనలు ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తాయా? అనేది వేచి చూడాలి.




Total views : 75957