పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మావుళ్లమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రావణ మాసం రెండో శుక్రవారం కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని వరలక్ష్మీ వ్రతాలు ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా మావుళ్లమ్మ అమ్మవారిని లక్షలాది గాజులతో అత్యంత సుందరంగా అలంకరించారు. గాజులతో అలంకరించిన అమ్మవారి రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అలాగే అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని కూడా ప్రత్యేకంగా, అద్భుతంగా అలంకరించారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం వెల్లివిరియాలని మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు లక్ష్మీదేవి ధైర్యం, సాహసం, పరాక్రమం అందించాలని కోరుకుంటూ భక్తిశ్రద్ధలతో వ్రతాలు చేస్తున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గాజులతో అలంకరించిన మావుళ్లమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
ప.గో.జిల్లా భీమవరంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం.
49
previous post