జోగులాంబ గద్వాల జిల్లా రాఘవేంద్ర కాలనీలో ప్రజల జీవితం నెమ్మదిగా కష్టాల్లోకి జారిపోతోంది. ఇళ్ల మధ్యలో నడుస్తున్న చిన్న ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగ ఇప్పుడు వారి ఆరోగ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తోంది. రోజూ శ్వాస తీసుకోవడమే కష్టంగా మారిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు ఆడుకోవాల్సిన వయసులోనే దగ్గు, ఆయాసంతో బాధపడుతుంటే, వృద్ధులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆస్తమా, సైనస్ వంటి సమస్యలు ప్రతి ఇంటిలో వినిపిస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతోంది. పలుమార్లు మున్సిపల్ అధికారులను సంప్రదించినా స్పందన లేకపోవడం ప్రజల్లో నిరాశను మరింత పెంచింది. ఆరోగ్యంగా జీవించాల్సిన హక్కు కోల్పోతున్నామనే బాధతో వారు ఇప్పుడు మీడియా ద్వారానే తమ గోడును బయటపెడుతున్నారు.
ఈ కాలుష్యం ప్రభావం కేవలం ఆరోగ్యంపైనే కాకుండా జీవనోపాధిపై కూడా తీవ్రంగా పడుతోంది. రాఘవేంద్ర కాలనీలో నివసించే చేనేత కార్మికులు తమ మగ్గాలపై కష్టపడి నేసిన చీరలు, ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగ కారణంగా నాశనమవుతున్నాయని వాపోతున్నారు. పొగలోని వ్యర్థ పదార్థాలు చీరలపై పడుతూ వాటి నాణ్యతను తగ్గిస్తున్నాయి. ఒక చీర పాడైతే ఒక రోజు సంపాదన కోల్పోయినట్టే. ఇలా ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోతూ వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ పిల్లల భవిష్యత్తు, తమ జీవనోపాధి రెండూ ప్రమాదంలో ఉన్నాయని వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం లేకపోవడంతో, ఇప్పుడు అయినా అధికారులు స్పందించి ఈ సమస్యకు ముగింపు పలకాలని కాలనీ ప్రజలు వేడుకుంటున్నారు.
మహబూబ్‌నగర్ మణికంఠ ఫోన్ ఇన్
దీనిపై మా ప్రతినిధి మణికంఠ మరిన్ని విషయాలు అందిస్తారు





Total views : 75408