మహిళలు స్వశక్తితో ముందుకు సాగేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని మరోసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళా వారోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 8 వేల ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు ఇప్పటి వరకు రూ.60 వేల కోట్లకు పైగా రుణాలు అందించామని, వడ్డీ లేని రుణాలను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని చెప్పారు. బ్యాంక్ నుంచి రుణాలు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. బ్యాంక్ లోన్ల చెల్లింపులో నిర్మల్ జిల్లా మహిళా సంఘాలు తొలి స్థానంలో ఉన్నాయని చెప్పారు.
మరోవైపు తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 29 నెలల్లో పది వేల కోట్ల రూపాయలకుపైగా ఉచిత బస్సు పథకం కోసం ఆర్టీసీకి చెల్లించామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయాలని గిట్టని వాళ్లు ప్రయత్నించారని.. అందుకోసం ఆటో కార్మికులను కూడా రెచ్చగొట్టారని గుర్తు చేశారు. మహిళలను బస్సులకు యజమానులు చేయాలనే ఉద్దేశంతో వెయ్యి బస్సులను మహిళా సంఘాలు కొనుగోలు చేసి.. ఆర్టీసీకి ప్రతి నెలా రూ.70 వేల చొప్పున అద్దెకు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. అందులో భాగంగా 553 బస్సులను ఇవాళ అంకితం చేశామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.




Total views : 90039