పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజవర్గంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులకు మూడోసారి భంగపాటు తప్పదని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం పెద్దపల్లి మండలం పెద్ద బొంకూరు గ్రామంలో గడప గడపకు వెళ్లి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజలు మరోసారి కాంగ్రెస్ ను నమ్మి ఓట్లు ఎలా వేస్తారన్నారు. కేసీఆర్ ను మూడోసారి సీఎం చేయడం ఖాయమని, పెద్దపల్లి నియోజవర్గంలో సైతం గులాబీ జెండా ఎగురుతుందన్నారు. వారంటీ లేని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చినా 60 గ్యారంటీలు ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని, ప్రపంచంలో ఎక్కడా కూడా లేని పథకాలను కేసీఆర్ అందిస్తున్న అందిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అండగా నిలవాలని అభ్యర్థించారు.
Kcr
ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుండి కోదాడ ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ వెళ్లనున్నారు. 1:40 నిమిషాలకి కోదాడకు కేసీఆర్ చేరుకోనున్నారు. 1:50 నిమిషాలకి ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణంకు చేరుకొని సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 2.30 నిమిషాలకు కోదాడ నుండి తుంగతుర్తి వెళ్లనునారు. 3:10 నిమిషాలకు తుంగతుర్తి చేరుకొని అక్కడ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 3:50 నిమిషాలకి ఆలేరు నియోజక వర్గ ప్రజా ఆశీర్వాదా సభకు బయల్దేరి వెళ్లనున్నారు. 4:10 నిమిషాలకు ఆలేరు చేరుకొని, 4:20 నిమిషాలకు ఆలేరు నియోజకవర్గ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆలేరు సభ అనంతరం తిరిగి హైదరాబాద్ కి తిరిగి వెళ్లనున్నారు.
సోనియాగాంధీని గతంలో రేవంత్ రెడ్డి బలిదేవత అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిందని.. తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోందన్నారు.మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో భాగంగా శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న ఆరోపణలు సరికాదని కేటీఆర్ అన్నారు. రుణాలు తెచ్చి ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టామన్నారు. రుణాల మొత్తాన్ని సాగునీటి రంగం, మిషన్ భగీరథకు వినియోగించామన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం రుణాలు తెచ్చామన్నారు. 9 ఏళ్ల క్రితంతో పోలిస్తే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. తెలంగాణది సమ్మిళిత, సమగ్ర, సమీకృత మోడల్ అన్నారు. 9 ఏళ్లలో కరువు లేదు, కర్ఫ్యూ లేదన్నారు. రాష్ట్రంలో ఎలాంటి వివక్ష లేదన్నారు. పేదరికంలో దేశం నైజీరియాను దాటిపోయింది. కాంగ్రెస్ 6 గ్యారంటీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తోందన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూనే పారిశ్రామికీకరణలో దూసుకుపోతున్నామన్నారు. కాంగ్రెస్ చేసిన పాపానికి తెలంగాణ 58 ఏళ్లు బాధపడిందన్నారు. 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్ 24 వేలు ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే ఇచ్చిందన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 9 ఏళ్ల అభివృద్ధి ఇప్పుడు ప్రజలకు కనిపిస్తోందన్నారు. తాము ప్రజలకు ప్రగతి నివేదికలు సమర్పిస్తున్నామన్నారు. ఐటీలో హైదరాబాద్, బెంగళూరును మించిపోయిందన్నారు.
ఎన్నికల్లో గెలవడానికి కొంతమంది పచ్చి అబద్దాలు చెబుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. వర్ధన్నపేట రింగ్ రోడ్డు కోసం ల్యాండ్ ఫూలింగ్ చేస్తారని పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఆరూరి రమేశ్‌పై నేరుగా గెలిచే దమ్ము లేనోళ్లు ఈ ప్రచారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ల్యాండ్ పూలింగ్ చేయబోమని ముఖ్యమంత్రిగా నేను హామీ ఇస్తున్నానన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రంసగించారు. ఓటు వేసే ముందు ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటేయాలి అని వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. 160 కోట్లతో వర్ధన్నపేట పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని కేసీఆర్ తెలిపారు. ఇవాళ కొంత మంది నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఇపుడు ఓట్ల కోసం వస్తున్నవారికి తెలంగాణపై అవగాహన లేదన్నారు. ఆరూరి రమేశ్ ఆధ్వర్యంలో వర్ధన్నపేట అన్ని రంగాల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించిందన్నారు.
కొందరు పదవుల కోసం పార్టీలు మారుతున్నారని, కానీ ఏ పార్టీ ప్రజలకు ఏం చేసిందో ఆలోచించి ఓటేయాలని సీఎం కేసీఆర్ కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా పాలేరు సభలో ప్రసంగించారు. సభలో సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రతిపక్ష పార్టీలపై ధ్వజమెత్తారు. సర్వజనుల సంక్షేమ కోసం పని చేసిన వారిని గెలిపించండి. బీఆర్ఎస్ వచ్చిన తర్వాతే భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు. పాలేరును ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 3 కోట్ల టన్నుల వరిధాన్యం తెలంగాణ రైతులు పండిస్తున్నారన్నారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు, దళితబంధు నిలిచిపోతాయని హెచ్చరించారు. పాలేరు ప్రజలకు ఉపేందర్‌రెడ్డి ఉండటం అదృష్టమన్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి మూలన కూర్చొన్న తుమ్మలను తీసుకొచ్చి మంత్రిని చేశామని గుర్తుచేశారు.తుమ్మల వల్ల పార్టీకి ఒరిగిందేమీ లేదని, ఇంకా పార్టీకి ఆయన నష్టం చేశాడన్నారు. ఉపేందర్‌రెడ్డిని గెలిపిస్తే పాలేరు అంతటా దళితబంధు ఇస్తామన్నారు. రేషన్‌కార్డుదారులందరికీ వచ్చే మార్చి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
పాలేరు ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ అబద్దాలే మాట్లాడారని, ఇది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ… 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒక్క కొత్తగూడెం మాత్రమే గెలిచిందని, దీంతో పార్టీ బలోపేతం కోసం నన్ను బతిమాలి పార్టీలో చేర్చుకొలేదా? అని ప్రశ్నించారు. నేను పార్టీలో చేరిన రోజూ జిల్లా పరిషత్ చైర్మన్ డీసీఎంఎస్ చైర్మన్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు వందల మంది సర్పంచ్‌లు పార్టీలో చేరింది నిజంకాదా? డిపాజిట్లు రాని పార్టీని జిల్లాలో నేను బలోపేతం చేసింది నిజం కాదా? అని నిలదీశారు. 40 ఏళ్ల సహవాసంలో నా నిబద్ధత ఏమిటో కేసీఆర్‌కు తెలుసునన్నారు. అలాంటి మీరు పార్టీ మారిన పువ్వాడ అజయ్ కుమార్‌కు ప్రభుత్వ భూములు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డికు కాంట్రాక్ట్‌లు ఇచ్చి… వారిని పక్కన పెట్టుకొని నాపై విమర్శలు చేస్తారా? నేను పార్టీ మారితే మీరుచేసిన వ్యాఖ్యలు జిల్లా ప్రజానీకం అంతా చూస్తున్నారన్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు తాను ఎంతగానో రుణపడి ఉంటానని, ఇక్కడి ప్రజల కోసం మీ రాజకీయ విమర్శలను భరిస్తానన్నారు. తెలంగాణ కల సాకారం చేసిన సోనియా గాంధీకి ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పారని, మానసిక దౌర్బల్యంతోనే కేసీఆర్ తనపై విమర్శలు చేశారన్నారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితం అంతా తెలిసి కూడా నీ స్వార్థం కోసం మాట్లాడతావా అని మండిపడ్డారు. తాను బీఆర్ఎస్లో చేరిన సమయంలో అక్కడకు వచ్చిన వారిని చూసి కేటీఆర్ అన్న వ్యాఖ్యలు గుర్తుకు లేవా? అన్నారు. మనం పార్టీ మారినా ఇంతమంది మనతో రారని కేటీఆర్ అనలేదా? తుమ్మలతో బీఆర్ఎస్ పార్టీలోకి ప్రభంజనంలా వచ్చి చేరారని చెప్పింది మర్చిపోయావా? పదవుల కోసం కాదు సీతారామ, భక్త రామదాసు ప్రాజెక్టుల కోసమే తాను పార్టీలో చేరుతున్నట్లు ఆ రోజే చెప్పానన్నారు. భక్త రామదాసు ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో తనను అపర భగీరథుడని పొగిడిన పొగడ్తలు జిల్లా ప్రజానీకం చూశారని, పాలేరులో నా ఓటమికి నీ కుమారుడే కారణమన్న విషయం మీకు తెలుసు అన్నారు. మా కత్తితో మేమే పొడుచుకున్నామని మీరే మీడియా ముఖంగా చెప్పారు, ఎంపీ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గెలుపు కోసం, స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపులో నా పాత్ర లేదా? అని తుమ్మల ప్రశ్నించారు. ఓడిపోయి మూలన కూర్చుంటే మంత్రి పదవి ఇచ్చానని, పార్టీ కోసం చేసింది నేను సున్నా అని చవకబారు విమర్శలు చేస్తావా? అని ధ్వజమెత్తారు.
అక్టోబర్ 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో సభతో ప్రచారం షెడ్యూల్ మొదలయ్య. నవంబర్ 08 సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో సభతో ముగియనుంది. ఇందులో భాగంగానే. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ లో ఈ నెల 30న సీఎం కేసీఆర్ పర్యటన జరగనుంది. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను ఎస్పీ చెన్నూరి రూపేష్ పరిశీలించారు. బందోస్తుకు సంబంధించి. పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని. ట్రాఫిక్ డైవర్షన్ చేసి, విధులలో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయం పాటించాలని సూచించారు ఎస్పీ చెన్నూరి రూపేష్.
కల్వకుంట్ల కుటుంబాన్ని ఓడిద్దాం. తెలంగాణను రక్షించుకుందాం అనే నినాదంతో ఈరోజు గజ్వేల్ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నుండి తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన యాత్ర ప్రారంభమయింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన మా పిల్లల త్యాగాలను ఎందుకు గుర్తించడం లేదు? తెలంగాణ ఉద్యమకారుల పోరాట వీరులకు కనీస గుర్తింపు లేకుండా ఎందుకు చేశారు? తెలంగాణలో దళిత బంధు పేరుతో ఏ ఒక్క సామాన్యుడుకైనా దళిత బందు ఇచ్చారా? అని ప్రశ్నించారు. మా అమరవీరులు ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ ను కాపాడుకోవడానికి ఈరోజు తెలంగాణ అమర వీరుల కుటుంబాలు తెలంగాణ ఉద్యమకారులు ఏకమై ఈరోజు గజ్వేల్ గడ్డమీద నుండి పిలుపునిస్తున్నాం అని తెలిపారు.
కొండగల్ రా.. గాంధీ బొమ్మ దగ్గరకు రా.. అని కొందరు నాకు సవాలు విసురుతున్నారని, కేసీఆర్ దమ్ము ఏంటో దేశమంతా చూసిందంటూ సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.టీపీసీసీ చీఫ్ రేవంత్ కు, కాంగ్రెస్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కోసం తాను పోరాడుతున్నప్పుడు ఈ నేతలంతా ఎవరి కాళ్లదగ్గర ఉన్నారో తెలియదని బీఆర్ఎఐస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఇపుడొచ్చి కేసీఆర్ కు దమ్ముందా? అని మాట్లాడుతున్నారు. పాలమూరు జిల్లాలో గతంలో గంజి, అంబలి కేంద్రాలు ఉండేవని, పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో ప్రజలు గుర్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశం మొత్తంలో 24గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఇప్పుడు దేశానికి దిక్సూచిగా నిలిచేలా తెలంగాణ ఎదిగిందన్నారు. ఇంటింటికీ నల్లా నీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 60లక్షల టన్నుల ధాన్యం పండే తెలంగాణ.. ఇవాళ 3కోట్ల టన్నుల ధాన్యం పండిస్తోందన్నారు. 24 గంటల కరెంటు ఇస్తే.. కాంగ్రెస్‌ను వీడి తెరాస కండువా కప్పుకొంటానని జానారెడ్డి సవాల్ విసిరారు. ఆ తర్వాత వెనక్కితగ్గారన్నారు. రైతు బంధు అనే పథకానికి ఆద్యుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి అచ్చంపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తామన్నారు. 32 పార్టీల మద్దతు కూడగట్టి తెలంగాణ సాధించా అని సీఎం కేసీఆర్ వివరించారు.
నేడు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా వెళ్లనున్నారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం జీళ్లచెరువులో 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. జిల్లాలోనే తొలి ఎన్నికల ప్రచార బహిరంగ సభ కావడం.. పోరుబిడ్డ, సీఎం కేసీఆర్ హాజరవుతుండడంతో స్వాగతం పలికేందుకు నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జనసమీకరణపై దృష్టి సారించిన పాలేరు ఎమ్మెల్యే, అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్.. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే కందాళ.. సీఎం సభకు ప్రజలు, లబ్ధిదారులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ తొలి సభ నిర్వహిస్తుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది.




Total views : 89929