Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Latest News తెలంగాణకు రూ.12 లక్షల కోట్లు ఇచ్చిన కేంద్రం..

తెలంగాణకు రూ.12 లక్షల కోట్లు ఇచ్చిన కేంద్రం..

by CVR NEWS
తెలంగాణకు రూ.12 లక్షల కోట్లు ఇచ్చిన కేంద్రం

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ సాక్షిగా.. జనసంద్రం మధ్య ప్రధాని నరేంద్ర మోదీ శంఖారావం పూరించారు. ఒకవైపు వేల కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టుల జాతర..మరోవైపు ‘వోకల్ ఫర్ లోకల్’ అంటూ స్వదేశీ మంత్రం విన్పించారు. బెంగాల్ విజయోత్సాహం.. తెలంగాణలోనూ స్పష్టంగా కనిపిస్తోందన్నారు ప్రధాని మోదీ. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జనసంద్రం మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం ఒక ప్రభంజనంలా సాగింది. ‘నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా.. మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘తెలంగాణ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది’ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని ఆయన స్పష్టం చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, రైల్వేలు, జాతీయ రహదారులు మరియు మౌలిక సదుపాయాల కోసం కేంద్రం కృషి చేస్తోందన్నారు ప్రధాని మోదీ.

తెలంగాణలో కుటుంబ పార్టీల పాలనతో ప్రజలు విసిగిపోయారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ గడ్డపై బీజేపీకి ఆది నుంచీ ఆదరణ ఉందని, పార్టీకి ఇద్దరు సభ్యులే ఉన్న కాలంలో కూడా ఒకరు ఈ గడ్డ నుంచే ఉన్నారని గుర్తు చేశారు. బీజేపీపై పెరుగుతున్న ఈ అభిమానం రాబోయే ఎన్నికల్లో మార్పుకు సంకేతమని, ‘అబ్ కీ బార్.. బీజేపీ సర్కార్’ నినాదాన్ని తెలంగాణ ప్రజలు నిజం చేయబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నుంచి లభిస్తున్న ఈ ప్రేమే తనను మరింత ఉత్సాహంగా పనిచేసేలా చేస్తోందన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు నెలకొనాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ప్రధాని తన ప్రసంగంలో ‘వోకల్ ఫర్ లోకల్’ మంత్రాన్ని నొక్కి చెప్పారు. విదేశీ వస్తువుల వ్యామోహం వీడి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, అప్పుడే భారతమాతను కాపాడుకున్న వాళ్లం అవుతామని పిలుపునిచ్చారు. వంటనూనెల వినియోగం తగ్గించాలని, పెట్రోల్ వినియోగం పై ఆధారపడటం తగ్గించాలని సూచించారు. చమురు దిగుమతుల భారం తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు, మెట్రో మరియు రైల్వేలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. దేశం ఆత్మనిర్భర్ కాకుండా చేసే శక్తులకు మనం దూరంగా ఉండాలని హెచ్చరించారు. రాగి వంటి ఖనిజాల కోసం గతంలో అడ్డంకులు సృష్టించడం వల్ల ఇప్పుడు విదేశాలపై ఆధారపడాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్ తీరును ఎండగట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేవంత్ సర్కార్ అందరినీ వెన్నుపోటు పొడిచిందని.. అబద్ధపు హామీలతో ప్రజలను వంచిస్తోందని నిప్పులు చెరిగారు. పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రసంగించిన కిషన్ రెడ్డి …ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిలో మోదీ ప్రభుత్వ పాత్రను గణాంకాలతో సహా వివరించారు. గత 11 ఏళ్లలో రాష్ట్రానికి ఏకంగా 12 లక్షల కోట్ల నిధులు ఇచ్చామని.. హైవేలు, వందే భారత్ రైళ్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి మోదీ చలవేనని స్పష్టం చేశారు. చివరికి రాష్ట్రంలో ఇచ్చే సన్నబియ్యం పథకానికి కూడా 80 శాతం నిధులు కేంద్రమే ఇస్తోందని గుర్తు చేశారు. ‘పదేళ్లు ఒక కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణ.. ఇప్పుడు గాంధీ కుటుంబం చేతిలో చిక్కుకుపోయింది’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం ముస్లింల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కోసం కాంగ్రెస్ మత రాజకీయాలకు తెరలేపిందని, ‘SIR’ పేరుతో ప్రభుత్వం ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తోందని మండిపడ్డారు. దేశంలోని 21 రాష్ట్రాల్లో బీజేపీ కూటమి అధికారంలో ఉండటమే మా పనితీరుకు నిదర్శనమన్నారు. తెలంగాణ విముక్తి చెందాలంటే అది కేవలం ‘మోదీ గ్యారంటీ’తోనే సాధ్యమని పునరుద్ఘాటించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: