అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రోజుకో ట్విస్ట్‌తో తమిళనాడులో రాజకీయం రసవత్తరంగా మారింది. నటుడు విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, అధికార పీఠం దక్కించుకోవడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మెజార్టీ లేని కారణంగా విజయ్‌ను సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేదని లోక్ భవన్ అధికారికంగా ప్రకటించింది. రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, విజయ్ మధ్య జరిగిన రెండో విడత భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం అనంతరం రాజ్ భవన్ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్ వద్ద లేదని.. కేవలం అతిపెద్ద పార్టీగా ఉన్నంత మాత్రాన ప్రభుత్వం ఏర్పాటుకు పిలవలేమని, రాజ్యాంగ నిబంధనల ప్రకారం మెజార్టీ సభ్యుల సంతకాలతో కూడిన మద్దతు లేఖలు సమర్పించాలని గవర్నర్ స్పష్టం చేశారు.
ఎన్నికల ఫలితాల ప్రకారం విజయ్ పార్టీ TVK 108 స్థానాలు సాధించింది. కాంగ్రెస్ తన 5 సీట్ల మద్దతును ప్రకటించడంతో ఈ సంఖ్య 113 కి చేరింది. విజయ్ రెండు చోట్ల గెలిచినందున, ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. అప్పుడు TVK బలం 107 కి తగ్గుతుంది. కాంగ్రెస్‌తో కలిపి కూటమి బలం 112 వద్దే ఆగిపోతుంది. అధికారం దక్కించుకోవడానికి విజయ్‌కు ఇంకా 6 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ అదనపు మద్దతు లేఖలు లేకపోవడంతోనే గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
గవర్నర్ నిర్ణయంపై టీవీకే మద్దతుదారులతో పాటు వీసీకే, సీపీఐ వంటి పార్టీలు మండిపడుతున్నాయి. అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్‌ను ముందుగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలి. మెజార్టీని నిరూపించుకోవడానికి అసెంబ్లీ వేదికగా అవకాశం ఇవ్వాలి తప్ప, రాజ్ భవన్‌లో సంతకాలు అడగడం రాజ్యాంగ విరుద్ధం అని వారు వాదిస్తున్నారు. కేంద్రం జోక్యంతోనే గవర్నర్ ఇలా చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
దాదాపు 60 ఏళ్ల ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి విజయ్ గట్టి దెబ్బ కొట్టినప్పటికీ, రాజ్యాంగపరమైన చిక్కులు ఆయనను వేధిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో డీఎంకే, ఏఐఏడీఎంకేలు కూడా ఈ అనిశ్చితిని తమకు అనుకూలంగా మార్చుకుని మళ్లీ చక్రం తిప్పాలని చూస్తున్నాయి. తమిళనాడు భవిష్యత్తు ఇప్పుడు ఆ 6 మంది ఎమ్మెల్యేల మద్దతు పైనే ఆధారపడి ఉంది. 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను విజయ్ ఎప్పుడు సమర్పిస్తారో, అప్పుడే దళపతి సీఎం పీఠంపై సందిగ్ధత తొలగిపోతుంది. రాబోయే 48 గంటలు తమిళనాడు రాజకీయాలకు అత్యంత కీలకంగా చెప్తున్నారు.
ప్రస్తుతం విజయ్ వద్ద ఉన్న సంఖ్యాబలం మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువగా ఉంది. ఒకవేళ చిన్న పార్టీల మద్దతుతో ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసినా, అది నూలుపోగు మీద నడిచే ప్రభుత్వంలా మారుతుంది. ఏ ఒక్క ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నా లేదా విపక్షాల ప్రలోభాలకు లోనైనా ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం ఉంది. ఇటువంటి బలహీనమైన ప్రభుత్వంతో విజయ్ తన భారీ సంక్షేమ హామీలను అమలు చేయడం అసాధ్యం అనే చర్చ నడుస్తోంది.
మరోవైపు విజయ్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిలబడాలంటే అన్నాడీఎంకే తో పొత్తు పెట్టుకోవడమే ఉత్తమ మార్గమని చర్చ జరుగుతోంది. 47 స్థానాలు కలిగిన అన్నాడీఎంకే గనుక ప్రభుత్వంలో భాగస్వామి అయితే, టీవీకే కూటమి బలం 160కి చేరుకుంటుంది. అయితే, దీనికి అన్నాడీఎంకే తన మిత్రపక్షమైన బీజేపీని వదులుకోవాల్సి ఉంటుంది. అటు అన్నాడీఎంకేలోని ఒక వర్గం విజయ్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నందున పళనిస్వామితో విజయ్ జరిపే చర్చలే కీలకం కానున్నాయి.
రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఏ పార్టీ అయినా బలమైన మిత్రపక్షాల కోసం చూస్తుంది. కానీ విజయ్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేశారు. అయితే సీనియర్ నేతలు దీన్ని అనుభవలేమి అని విమర్శించారు. ఇక మ్యాజిక్ ఫిగర్ రాకముందే ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు చేసుకోవడం, ఆ తర్వాత అది రద్దు కావడమే ఆయనకు రాజకీయంగా కొంత ఇబ్బంది కలిగించిన విషయంగా చెప్తున్నారు. సాధారణంగా అనుభవం ఉన్న నేతలు తెర వెనుక మద్దతు కూడగట్టుకున్నాకనే అధికారిక ప్రకటనలు చేస్తారు. విజయ్ విషయంలో ఆ హడావిడి కొంత పబ్లిసిటీ స్టంట్ లాగా మారిందనే విమర్శలు వచ్చాయి.
స్టాలిన్, పళనిస్వామి వంటి నేతలు దశాబ్దాలుగా గ్రౌండ్ లెవల్ రాజకీయాల్లో ఉన్నారు. విజయ్‌కి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ ముందుకొచ్చినా, మిగిలిన 5 సీట్ల కోసం ఆయన ఇతర పార్టీల బేరసారాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇక్కడ ఆయనకు రాజకీయ చతురత ఎంత ఉందనేది ఇప్పుడు అసలైన పరీక్ష. అయితే విజయ్‌కు రాజకీయ చతురత ఉందో లేదో ఇప్పుడే ఒక అంచనాకు రాలేం. అయితే, కేవలం సినిమాల ద్వారా వచ్చే ఇమేజ్ వేరు, అసెంబ్లీలో ఫ్లోర్ మేనేజ్మెంట్ చేయడం వేరు. అక్కడ ఆయన నెగ్గాలంటే కచ్చితంగా తన రాజకీయ చతురతను నిరూపించుకోవాల్సి ఉంటుంది.
విజయ్ ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, మద్దతు ఇచ్చే పార్టీల ఒత్తిడిని తట్టుకోవడం ఆయనకు అతిపెద్ద సవాలుగా మారుతుంది. విజయ్ పార్టీకి సొంతంగా మెజార్టీ లేదు కాబట్టి, మద్దతు ఇచ్చే పార్టీలు ఖచ్చితంగా కీలకమైన మంత్రి పదవులను అంటే హోమ్, ఆర్థిక, రెవెన్యూ వంటి శాఖలను ఆశిస్తాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 2 క్యాబినెట్ బెర్త్‌లను కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో కొత్తగా వచ్చిన పార్టీగా విజయ్ తన మార్క్ పాలన చూపించాలనుకుంటారు. కానీ కీలక శాఖలు ఇతరుల చేతిలో ఉంటే, ఆయన అనుకున్న మార్పులను తీసుకురావడం కష్టమవుతుంది. మరి ఈ సవాలును విజయ్ ఎలా ఎదుర్కొంటారన్నది చూడాలి.
విజయ్ తన పార్టీ సిద్ధాంతాన్ని ద్రవిడ జాతీయవాదం, లౌకికవాదం అని ప్రకటించారు. కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు ఇస్తూనే, మతతత్వ శక్తులను దూరంగా ఉంచాలి అనే కండిషన్ పెట్టింది. ఒకవేళ VCK లేదా ఎడమపక్షాలు మద్దతు ఇస్తే, వారు తమ సామాజిక న్యాయం, కార్మిక వర్గ ఎజెండాలను ప్రభుత్వం అమలు చేయాలని ఒత్తిడి చేస్తారు. మరి వీటిని అన్నిటిని సమన్వయం చేయడం విజయ్‌కు కత్తిమీద సామే అని చెప్పాలి. ఇక మాజీ సీఎం స్టాలిన్ ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వాలని.. ఆరు నెలల పాటు తాము వేచి చూస్తామని ఆయన అన్నారు. ఇది విజయ్‌కు ఊరటనిచ్చే విషయమే అయినా, ఆ ఆరు నెలల తర్వాత ప్రతిపక్షం నుంచి ఒత్తిడి తీవ్రమవుతుంది. ఆ లోపు తన బలాన్ని నిరూపించుకుని నిలదొక్కుకోకపోతే.. ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంటుంది.
మరోవైపు TVK నుంచి గెలిచిన 108 మంది ఎమ్మెల్యేలలో అత్యధికులు కొత్తవారే. సంకీర్ణ ప్రభుత్వంలో ఇతర పార్టీల సీనియర్ నేతలతో చర్చలు జరపడం, అసెంబ్లీలో వ్యూహాలు రచించడం వంటి విషయాల్లో విజయ్‌కు అనుభవం ఉన్న నాయకుల కొరత ఉంది. AIADMK వంటి పార్టీలు ఒకవేళ బయటి నుంచి మద్దతు ఇస్తే, ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వం వారిపై ఆధారపడాల్సి వస్తుంది. ఇది పరిపాలనలో జాప్యానికి దారితీస్తుంది.
సినిమాల్లో విజయ్ అన్నీ తానై నడిపిస్తారు. కానీ రాజకీయం ఇవ్వడం-తీసుకోవడం పద్ధతిలో నడుస్తుంది. మిత్రపక్షాల ఒత్తిడికి తలొగ్గితే ఆయన ఇమేజ్ దెబ్బతినవచ్చు. అలాగని ఒత్తిడికి లొంగకపోతే ప్రభుత్వం పడిపోయే ఛాన్స్ ఉంటుంది. విజయ్ ఈ ఒత్తిడిని తట్టుకోవాలంటే ఆయనకు స్ట్రాంగ్ కోఆర్డినేషన్ కమిటీ అవసరం. మిత్రపక్షాల డిమాండ్లను నెరవేరుస్తూనే, తన సొంత ఎజెండాను ఎలా ముందుకు తీసుకెళ్తారనేది ఆయన రాజకీయ పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న హంగ్ పరిస్థితిలో, విజయ్ సీఎం కుర్చీ ఎక్కినా, అది ముళ్ల కిరీటమే అవుతుంది అనడంలో సందేహం లేదు.
ఒకవేళ విజయ్ మే 10 లోపు మెజార్టీ నిరూపించుకోలేకపోతే వేరే కూటమికి గవర్నర్ చాన్స్ ఇవ్వవచ్చు. రెండో అతిపెద్ద పార్టీ లేదా కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరవచ్చు. అయితే ఏ పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో లేకపోతే, గవర్నర్ సిఫార్సు మేరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. రాజకీయ అనిశ్చితి ఇలాగే కొనసాగితే ఆరు నెలల తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, విజయ్ కొన్ని వ్యూహాత్మక పొరపాట్లు చేశారు. స్పష్టమైన మెజార్టీ రాకముందే ప్రమాణ స్వీకారం కోసం తేదీని నిర్ణయించుకోవడం ఆయనకు ప్రతికూలంగా మారింది. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లేదా చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని ఉంటే, ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. కేవలం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆయన గవర్నర్‌ను కోరి ఉండాల్సింది. కానీ ఆయన ముందే మెజార్టీ ఉంది అని చెప్పడం వల్ల ఇప్పుడు గవర్నర్ ఆ సంఖ్యను నిరూపించుకోమని ఒత్తిడి తెస్తున్నారు. అయితే గవర్నర్ అవకాశం ఇవ్వకపోతే విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. గతంలో ఎస్.ఆర్. బొమ్మై కేసు తీర్పు ప్రకారం, మెజార్టీ అనేది రాజ్‌భవన్‌లో కాదు, అసెంబ్లీ ఫ్లోర్ మీద నిరూపించుకోవాలి. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని విజయ్ వాదించవచ్చు. కోర్టు జోక్యం చేసుకుంటే, అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని గవర్నర్‌ను ఆదేశించే అవకాశం ఉంది.
మరోవైపు విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇప్పుడు మూడు మార్గాలు ఉన్నాయి. ఇందులో మొదటిది చిన్న పార్టీలతో పొత్తు కాంగ్రెస్ 5, VCK 2, CPI/CPM 4.. వీరంతా మద్దతు ఇస్తే 119 సీట్లతో గట్టెక్కవచ్చు. అయితే ఈ చిన్న పార్టీలు సిద్ధాంతపరంగా బలమైనవి. ప్రతి విషయంలోనూ వారు విజయ్‌ను బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంటుంది. ఇది పాలనలో అస్థిరతకు దారితీయవచ్చు. ఇక రెండో ఆప్షన్ విషయానికొస్తే.. ఆన్నాడీఎంకే మద్దతు. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే తన ప్రత్యామ్నాయ రాజకీయాలు దెబ్బతింటాయని విజయ్ భావిస్తున్నారు. అన్నాడీఎంకే అధికారం పంచుకోవాలని కోరుతోంది, కానీ విజయ్ ఒంటరి సారథ్యం కోరుకుంటున్నారు.
ఇక మూడో ఆప్షన్ విషయానికొస్తే.. డీఎంకే, అన్నాడీఎంకే ఏకమవుతాయని జోరుగా ప్రచారం సాగుతోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరన్నది నిజం. విజయ్‌ను అడ్డుకోవడానికి డీఎంకే , అన్నాడీఎంకే చేతులు కలిపే అవకాశం ఉందా అంటే, అది అసాధ్యం కాదు కానీ చాలా కష్టం. ఒకవేళ ఈ రెండు ద్రవిడ దిగ్గజాలు కలిస్తే అది తమిళ రాజకీయ చరిత్రలోనే పెద్ద సంచలనం అవుతుంది. కానీ, ఇది వారి సొంత కేడర్‌కు తప్పుడు సంకేతాలు పంపుతుంది.
తమిళనాడులో ప్రస్తుతం సిద్ధాంతాల కంటే అధికారం, ఉనికికే ప్రాధాన్యత కనిపిస్తోంది. విజయ్ తన సిద్ధాంతాల కోసం రాజీ పడకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు. మద్దతు ఇచ్చే పార్టీలు తమ ఉనికి కోసం విజయ్‌ను వాడుకోవాలని చూస్తాయి. మొత్తానికి విజయ్ ఇప్పుడు ఒక గొప్ప నటుడిలా కాకుండా, ఒక ఆరితేరిన రాజకీయ చతురుడిలా వ్యవహరించాలి. న్యాయ సలహాలు తీసుకోవాలి. ఇప్పటికే క్యాంప్ పాలిటిక్స్ మొదలయ్యాయి కాబట్టి.. తన ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ, తన బలాన్ని అసెంబ్లీలో నిరూపించుకోవాలి. ఇదే విజయ్ ముందున్న ఏకైక మార్గం అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదే సమయంలో విజయ్ నివాసం వద్ద ఒక ఆసక్తికరమైన, భావోద్వేగపూరిత దృశ్యం కనిపించింది. విజయ్‌ను ముఖ్యమంత్రి కాకుండా కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఒక అభిమాని కన్నీరు పెట్టుకున్నారు. ప్రజలు మార్పును కోరుకుని విజయ్‌కు మద్దతు ఇచ్చారని, కానీ గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సదరు అభిమాని ఆవేదన వ్యక్తం చేశారు.
గవర్నర్ తన తీరు మార్చుకోకపోతే తమిళనాడు మరోసారి ఉగ్రరూపం దాల్చుతుందని విజయ్ అభిమాన సంఘాలు హెచ్చరించాయి. గతంలో జరిగిన జల్లికట్టు ఉద్యమం తరహాలో రాష్ట్రవ్యాప్తంగా యువత రోడ్లపైకి వస్తుందని, అప్పుడు పరిస్థితి అదుపు తప్పుతుందని వారు స్పష్టం చేశారు. అటు సోషల్ మీడియాలో కూడా విజయ్‌కు మద్దతుగా వందలాది పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ కార్యాలయం నుంచి విజయ్‌కు ఇంకా క్లియరెన్స్ రాలేదు. సొంతంగా మెజారిటీ లేని పక్షంలో, మద్దతు ఇస్తున్న పార్టీల ఎమ్మెల్యేలతో కలిసి మొత్తం 118 మంది సభ్యుల జాబితాను సమర్పించాలని గవర్నర్ పట్టుబడుతున్నట్లు సమాచారం. బలం నిరూపించుకుంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇస్తామని గవర్నర్ స్పష్టం చేయడంతో టీవీకే వర్గాల్లో ఆందోళన నెలకొంది.
మరోవైపు, గవర్నర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటానికి సిద్ధమైంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. గవర్నర్ కేంద్రం చేతిలో పావుగా మారారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మొత్తానికి, తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు రాజ్‌భవన్ చుట్టూ తిరుగుతున్నాయి. గవర్నర్ నిర్ణయంపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.






Total views : 74955