Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Telangana ప్రాణాలు తీస్తున్న మోత్కూరు-భువనగిరి రహదారి..

ప్రాణాలు తీస్తున్న మోత్కూరు-భువనగిరి రహదారి..

by CVR NEWS
ప్రాణాలు తీస్తున్న మోత్కూరు-భువనగిరి రహదారి

యాదాద్రి భువనగిరి జిల్లాలో మోత్కూరు-భువనగిరి ప్రధాన రహదారి దుస్థితి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మోత్కూరులోని పనకబండ చౌరస్తా నుంచి రాజన్నగూడెం వరకు ఉన్న రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి ప్రమాదాలకు నిలయంగా తయారైంది. ప్రతిరోజూ వందలాది వాహనాలు, ఆర్టీసీ బస్సులు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్లను అంబులెన్స్‌లలో జిల్లా కేంద్రానికి తరలించే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. రహదారిపై గుంతలు ఎక్కువగా ఉండటంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు గాయపడగా, కొందరు ప్రాణాలు కోల్పోయినా అధికారుల్లో చలనం కనిపించడం లేదని మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే హామీలు ఇచ్చి, తర్వాత ప్రజలను మర్చిపోతున్న రాజకీయ నాయకుల తీరుపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నాలుగేళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ మూడు కిలోమీటర్ల రహదారిని బీటీ రోడ్డుగా అభివృద్ధి చేయడానికి సుమారు 5 కోట్ల 80 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల హడావుడిలో అప్పట్లో పనులు ప్రారంభం కాలేదు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పనులు మొదలైనప్పటికీ, కాంట్రాక్టర్ కేవలం ఒక కిలోమీటర్ వరకు మాత్రమే బీటీ వేసి మిగతా పనులు మధ్యలోనే నిలిపివేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితో మరో కాంట్రాక్టర్ రోడ్డుపై మట్టి పోసి చదును చేయడంతో ప్రజల్లో కొంత ఆశ నెలకొంది. కానీ మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాక మళ్లీ పనులు పూర్తిగా ఆగిపోయాయి. ప్రస్తుతం రోడ్డుపై వేసిన కూల్ మిక్స్ కూడా ఊడిపోవడంతో గుంతలు మరింత ప్రమాదకరంగా మారాయి. వర్షం పడితే బురద, ఎండపడితే దుమ్ముతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

మోత్కూరు నుంచి భువనగిరి జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం కావడంతో ప్రజలు తప్పనిసరిగా ఈ రహదారినే వినియోగించాల్సి వస్తోంది. అయితే రోడ్డంతా గుంతలతో నిండిపోవడంతో ద్విచక్ర వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. వాహనాలు వెళ్లే సమయంలో లేచే దుమ్ము, ధూళితో ఒక చేత్తో ముక్కు మూసుకుని మరో చేత్తో వాహనాన్ని నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి మరమ్మతుల పేరుతో పనులు మొదలుపెట్టి మధ్యలో వదిలేయడం ప్రజలను మరింత నిరాశకు గురిచేస్తోంది. ఎన్నికల ముందు ఓట్ల కోసం మాత్రమే పనులు ప్రారంభించి, ఎన్నికల తర్వాత వాటిని పట్టించుకోకపోవడం బాధాకరమని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, అసంపూర్తిగా ఆగిపోయిన రోడ్డు పనులను వెంటనే పూర్తి చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రయాణికులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: