Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home National 76 ఏళ్ల తర్వాత బెంగాల్‌లో తొలిసారి అధికారంలోకి బీజేపీ..

76 ఏళ్ల తర్వాత బెంగాల్‌లో తొలిసారి అధికారంలోకి బీజేపీ..

by CVR NEWS
76 ఏళ్ల తర్వాత బెంగాల్‌లో తొలిసారి అధికారంలోకి బీజేపీ

76 ఏళ్లుగా ఎదురుచూసిన కల.. జనసంఘ్ కాలం నాటి ఆశ.. ఇప్పుడు నిజమైంది. ఎస్.. ఏడున్నర దశాబ్దాల తర్వాత బెంగాల్ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడింది. 2011లో బెంగాల్‌లో ఒక్క సీటు గెలవని బీజేపీ..సరిగ్గా 15 ఏళ్లలోనే తృణమూల్ కంచుకోటను బద్దలు కొట్టింది. వరుసగా మూడు సార్లు గెలిచి బెంగాల్‌లో పెత్తనం చెలాయించాలనుకున్న మమత పార్టీని తాజా ఎన్నికల్లో కాషాయదళం మట్టికరిపించింది. బెంగాలీలు అప్పట్లో లాల్ సలాం అన్నారు.. తర్వాత ఖేలా హోబే అన్నారు.. ఇప్పుడు మాత్రం ఢిల్లీ నుంచి గల్లీ దాకా అంతా జై శ్రీరామ్ అంటూ బీజేపీకి జైకొట్టారు. ఇది కేవలం నినాదం కాదు.. మమతకు బీజేపీ ఇస్తున్న గట్టి షాక్. ఇన్నాళ్లు బెంగాల్ రాజకీయాలు అంటే ఒక వైపు హింస.. మరోవైపు అవినీతి పాలన. కానీ ఇప్పుడు సీన్ మారింది. అక్కడ సెక్యులరిజం ముసుగులు తొలగిపోయాయి.. కాషాయపు రంగులు పులుముకున్నాయి.

పశ్చిమ బెంగాల్‌లో విజయం సాధించాలనే బీజేపీ ఆశయం నెరవేరింది. బెంగాల్ కోటను గెలిచేందుకు ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్న బీజేపీ.. 2021లో విజయానికి చేరువైంది. అధికారం అందినట్లే అంది చేజారిపోయింది. కానీ ఈసారి మరింత పక్కా ప్లాన్‌తో ముందుకెళ్లిన కమలం పార్టీ.. బెంగాల్‌ గడ్డపై కాషాయ జెండాను ఎగరేసింది. ఈ విజయంతో బెంగాల్‌లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. బెంగాల్‌లో బీజేపీ గెలవడం వల్ల పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌పై గట్టిగానే ప్రభావం పడే అవకాశం ఉంది.

బెంగాల్‌లో బీజేపీ గెలిచి నివలడానికి అతిపెద్ద కారణం హిందూ ఓట్ల ఏకీకరణ. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ చేసిన ప్రచారం క్షేత్రస్థాయిలో బలంగా పనిచేసింది. ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో చొరబాట్లు, మతపరమైన ఘర్షణలు హిందూ ఓటర్లను బీజేపీ వైపు మళ్లేలా చేశాయి. అలాగే బెంగాల్ సరిహద్దుల గుండా జరుగుతున్న అక్రమ చొరబాట్లను బీజేపీ ప్రధాన ఎజెండాగా మార్చింది. మమతా బెనర్జీ ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే చొరబాటుదారులను ప్రోత్సహిస్తున్నారని ప్రధాని మోదీ, అమిత్ షా పదేపదే విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే.. డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ విధానం ద్వారా అక్రమ వలసదారులను ఏరివేస్తామని ఇచ్చిన హామీ హిందూ ఓటర్లను ఏకం చేసింది.

బెంగాల్‌లో ఒకప్పుడు బలంగా ఉన్న CPM,కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మమతను ఓడించాలంటే బీజేపీయే సరైన ప్రత్యామ్నాయం అని భావించిన వామపక్ష కార్యకర్తలు, ఓటర్లు తమ మద్దతును బీజేపీకి బదిలీ చేశారు. దీనివల్ల బీజేపీ ఓట్ షేర్ అనూహ్యంగా పెరిగి, అది సీట్ల రూపంలోకి మారింది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి అగ్రనేతలు బెంగాల్‌పై ప్రత్యేక దృష్టి సారించి చేసిన భారీ బహిరంగ సభలు ఓటర్లను ఆకట్టుకున్నాయి. మమతా బెనర్జీ బయటి వ్యక్తులు వర్సెస్ వర్సెస్ భూమిపుత్ర అన్న నినాదంతో ప్రచారం చేయగా, ప్రధాని మోదీ మాత్రం ఝల్ మురి తింటూ బెంగాలీ సంస్కృతితో మమేకమై ప్రజల మనసు గెలుచుకున్నారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ తన హిందుత్వ ఎజెండాను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. నందిగ్రామ్ వంటి కీలక నియోజకవర్గాల్లో హిందూ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపడం. ముస్లిం ఓట్లు టీఎంసీ, ఇతర సెక్యులర్ పార్టీల మధ్య చీలిపోవడం బీజేపీకి సానుకూలంగా మారింది. ఇక రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హింస, సందేశ్‌ఖాలీ వంటి ఘటనలు మహిళా ఓటర్ల మనోభావాలను ప్రభావితం చేశాయి. మమతా బెనర్జీకి మహిళా ఓటర్లు వెన్నెముకగా ఉండేవారు, కానీ ఈసారి మహిళా రక్షణపై బీజేపీ చేసిన నిరంతర పోరాటం వారిలో కొంత చీలిక తెచ్చింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో నమోదైన 92 శాతం పోలింగ్..ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకునే ఓటర్లు పెద్ద ఎత్తున బయటకు వచ్చారనడానికి సంకేతం. గతంలో లెఫ్ట్ పార్టీలకు, టీఎంసీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు ఈసారి బీజేపీ వైపు మళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది.

ఇక బెంగాల్ ఎన్నికల్లో మటువా కమ్యూనిటీ పాత్ర చాలా కీలకం. పశ్చిమ బెంగాల్‌లోని సుమారు 50 నుండి 70 అసెంబ్లీ స్థానాలను ప్రభావితం చేయగల శక్తి ఈ వర్గానికి ఉంది. మటువా కమ్యూనిటీ దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రధాన అంశం పౌరసత్వం. అయితే దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చింది బీజేపీ. ఇది మటువాలను ఆకర్షించింది. బంగ్లాదేశ్ నుండి వచ్చిన శరణార్థులకు శాశ్వత గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని బీజేపీ కలిగించగలిగింది. గతంలో ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌లోని మటువా వ్యవస్థాపకుడు హరిచంద్ ఠాకూర్ జన్మస్థలం అయిన ఓరకాండిని సందర్శించడం వారిలో బలమైన సెంటిమెంట్‌ను రగిల్చింది.

గతంలో ఈ వర్గం టీఎంసీకి అండగా ఉండేది. కానీ 2019 లోక్‌సభ మరియు 2021 అసెంబ్లీ ఎన్నికల నుండి వీరు క్రమంగా బీజేపీ వైపు మళ్లారు. మటువాలు షెడ్యూల్డ్ కులాలకు చెందినవారైనప్పటికీ, వారిని హిందూ ఓటు బ్యాంకులో భాగంగా ఏకీకృతం చేయడంలో బీజేపీ విజయం సాధించింది. మటువా ఓటర్లు కేవలం ఒక కులంగా కాకుండా, ఒక నిర్ణయాత్మక శక్తిగా మారారు. బెంగాల్‌లో టీఎంసీ కోటను బద్దలు కొట్టడానికి బీజేపీ వాడిన అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో మటువాల మద్దతు ఒకటని స్పష్టంగా చెప్పవచ్చు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

012418
Total views : 75053

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.