అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వనుంది. H-1B వీసాపై లక్షా 3 వేల డాలర్ల వరకు ఫీజు విధించే ప్రతిపాదనలను తీసుకొచ్చింది. కోర్టులు గతంలో కొన్ని చర్యలను అడ్డుకున్నప్పటికీ, వీసా విధానాల్లో కఠిన మార్పుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం H-1B వీసా లబ్ధిదారుల్లో దాదాపు 71 శాతం మంది భారతీయులే ఉండటంతో ఈ ప్రతిపాదనలు భారతీయ ఐటీ నిపుణులపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. H-1B వీసాతో పాటు అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు సంబంధించిన F-1 వీసా, యూనివర్సిటీ పూర్తి చేసి ఉద్యోగాల్లో చేరేందుకు ఉపయోగించే OPT ప్రోగ్రామ్‌పైనా భారీ ఫీజు విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
అంతేకాకుండా, అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన H-1B వీసాదారులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. H-1B వీసాలకు స్పాన్సర్ చేసే కంపెనీలపై కూడా అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. H-1Bకు సంబంధించిన మొత్తం 3 లక్షలా 99 వేల 402 పిటిషన్లలో సుమారు 71 శాతం భారతీయులవే. ఈ మార్పులను ఈ ఏడాది చివరి నాటికి అమలు చేయాలని ట్రంప్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇవి ప్రస్తుతం ప్రతిపాదనల దశలోనే ఉండగా, తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.