తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో అపరిశుభ్రత తీవ్ర సమస్యగా మారింది. చెత్త సేకరణ యంత్రాలు పనికిరాకపోవడంతో పట్టణం అంతటా చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. రెండు కాంపాక్ట్ యంత్రాల్లో ఒకటి పూర్తిగా నిలిచిపోగా, మరో యంత్రంతోనే నిర్వహణ కొనసాగుతోంది. దీంతో రోజువారీ చెత్త సేకరణ పూర్తిస్థాయిలో జరగడం లేదు. డ్రైనేజీలు చెత్తతో నిండిపోవడంతో మురుగు నీరు నిలిచిపోతుంది. దింతో దోమల పెరుగుదలకు కారణం అవుతుంది . ఫాగింగ్ యంత్రాలు కూడా మరమ్మతుల పేరుతో మూలకు చేరడంతో ప్రజలు దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు కనిపించడం స్థానికుల ఆందోళనకు కారణమవుతోంది. ప్రజలు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారానికి చర్యలు కనిపించకపోవడం తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. గ్రేడ్-1 మున్సిపాలిటీగా మారిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులు కొనసాగడం పై ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు .
కొవ్వూరు మున్సిపాలిటీలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు కార్యాలయానికి వెళితే అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండరని చెబుతున్నారు . ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళ్తారు అనే సమాచారం లేక ప్రజలు అయోమయంలో పడుతున్నారు. మధ్యాహ్నం భోజనం పేరుతో బయటకు వెళ్లిన సిబ్బంది తిరిగి ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే సమయం అయ్యే సరికి కార్యాలయం నుంచి వెళ్లిపోవడంలో మాత్రం కచ్చితత్వం పాటిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రతి కౌన్సిల్ సమావేశంలో యంత్రాల మరమ్మతుల పేరుతో నిధులు మంజూరు చేసినప్పటికీ వాటి వినియోగంపై స్పష్టత లేదు. కాగితాలకే పరిమితమయ్యే పనులతో మున్సిపాలిటీ పరిపాలన సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు పట్టణ పరిస్థితులను పట్టించుకోకపోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. సమస్యలు పెరుగుతున్నా పరిష్కారానికి చర్యలు కనిపించకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చుతోంది.
డంపింగ్ యార్డు సమస్య కొవ్వూరు పట్టణానికి ప్రధాన సమస్యగా మారింది. గతంలో పంగిడి గ్రామంలో డంపింగ్ యార్డు కోసం స్థలం సేకరించినప్పటికీ, స్థానికుల ఆందోళనలతో పనులు నిలిచిపోయాయి. దీంతో పట్టణంలో రోజూ సేకరించే చెత్తను శివార్లలో ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. ఇది పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతోంది. పట్టణంలోకి వచ్చే కొత్త వారికి చెత్త కుప్పలు మొదటి చూపులోనే కనిపించడం పట్టణ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. మరోవైపు గోదావరి బండ్ వెంట ఏర్పాటు చేసిన పార్కులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ పార్కులు ప్రస్తుతం అడవిని తలపించే స్థితికి చేరాయి. చిన్నపిల్లల ఆట పరికరాలు శిధిలావస్థలో ఉన్నాయి. పార్కులు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ అభివృద్ధి కోసం ఖర్చు చేసిన నిధులు వృథా అవుతున్నాయన్న భావన ప్రజల్లో పెరుగుతోంది.
కొవ్వూరు గోష్పాద క్షేత్రం కూడా అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. రోజూ వందలాది భక్తులు గోదావరి స్నానాలకు ఇక్కడికి వస్తుంటారు. అయితే భక్తులకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలు అందుబాటులో లేవు. ముఖ్యంగా మరుగుదొడ్లు తాళాలు వేసి ఉండటం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేవుల వద్ద అపరిశుభ్ర వాతావరణం నెలకొనడం ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. మరోవైపు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో వ్యాపారులు అనుమతులకు మించి నిర్మాణాలు చేపట్టినా టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితులు పరిపాలనా లోపాలను స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రజల సమస్యలపై స్పందించాల్సిన అధికారులు మౌనం వహించడం విమర్శలకు తావిస్తోంది. గ్రేడ్-1 మున్సిపాలిటీగా ఉన్న కొవ్వూరులో ఈ పరిస్థితులు కొనసాగడం పై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.





Total views : 61466