ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాలుగు యూరప్ దేశాల పర్యటనకు వెళ్లనున్న ఆయన, మార్గమధ్యంలో కేవలం మూడు, నాలుగు గంటల పాటు అబుదాబిలో ఆగే అవకాశం ఉంది. ఈ స్వల్ప వ్యవధిలోనే యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో ప్రధాని సమావేశం కానున్నారు. అయితే, ఈ పర్యటనపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ప్రధాని యూఏఈ పర్యటనకు తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా, మే 1 నుంచి చమురు ఉత్పత్తి దేశాల కూటమి నుంచి యూఏఈ వైదొలగనున్న నేపథ్యంలో ఈ భేటీ అత్యంత కీలకం కానున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ ముడి చమురు ధరలను ప్రభావితం చేయడంలో ఒపెక్ పాత్ర కీలకం… కాగా, ముడి చమురు దిగుమతులపై దృష్టి పెట్టిన భారత్‌కు.. తాజా పరిణామాలతో ఇంధన ధరలు, సరఫరా ఒప్పందాల విషయంలో సరికొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరిలో యూఏఈ అధ్యక్షుడు భారత్‌లో పర్యటించగా.. ఏప్రిల్‌లో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ యూఏఈకి వెళ్లి వచ్చారు. అంతకు ముందు 2022లో మాజీ అధ్యక్షుడి మృతికి సంతాపం తెలిపేందుకు మోదీ యూఏఈ వెళ్లారు. రెండు దేశాల అగ్రనేతల మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం, తాజా దౌత్యపరమైన పరిణామాల నేపథ్యంలో ఈ ఆకస్మిక భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.





Total views : 61413