దేశానికి అన్నం పెట్టే అన్నదాత.. ఇప్పుడు అడుగడుగునా దగా పడుతున్నాడు. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ప్రార్థించిన ఆ కళ్లు.. ఇప్పుడు గిరిజన సహకార సంఘం కొనుగోలు కేంద్రాల వైపు దీనంగా చూస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెంలో అన్నదాతల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. చేతికందిన పంటను గుండెలకు హత్తుకుని కేంద్రానికి తీసుకు వస్తే.. అక్కడ ఎదురవుతున్న పరిస్థితులు వారిని కుంగదీస్తున్నాయి.
20 రోజులు.. అక్షరాలా ఇరవై రోజులుగా మండుటెండలో, కనీసం తాగడానికి నీరు కూడా లేని చోట రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం ఒకవైపు.. ‘తరుగు’ పేరుతో జరుగుతున్న నిలువు దోపిడీ మరోవైపు. ప్రతి క్వింటాల్‌కు రెండు కిలోల చొప్పున రైతుల పొట్ట కొడుతున్నారు. అర్థాకలితో అలమటిస్తూ, అప్పుల వాళ్ల భయంతో వణికిపోతున్నారు.
పంట చేతికొచ్చినప్పుడు ఆ రైతు ఎంత మురిసిపోయాడో.. ఈరోజు అదే పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి ఇరవై రోజులు గడుస్తోంది. . ‘రేపు కొంటాం.. మాపు కొంటాం’ అని అధికారులు చెబుతున్న మాటలు… కోటి ఆశలతో ఎదురుచూసే రైతు గుండెల్లో శూలాల్లా గుచ్చుకుంటున్నాయి. గిరిజన సహకార సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కొనుగోలు ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా స్పష్టంగా కనబడుతోంది.
రైతు కష్టాన్ని దోచుకోవడానికి ‘తరుగు’ అనే ఒక వింత ఆచారం అమలవుతోంది. క్వింటాల్ కు అదనంగా రెండు కిలోలు! ఎందుకు? ఏ లెక్కన? ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇప్పటికే దెబ్బతిన్న రైతుకు, ఈ రెండు కిలోల తరుగు అంటే ఒక్కో క్వింటాల్ పై వందల రూపాయల నష్టం. ఊరికే పండలేదు ఆ పంట.. ఎరువుల కోసం, విత్తనాల కోసం, కూలీల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి. అటు అప్పుల వాళ్ల భయం.. ఇటు అధికారుల నిర్లక్ష్యం.. మధ్యలో నలిగిపోతున్నాడు రైతన్న.
కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి చూస్తే సభ్య సమాజం తలదించుకోవాలి. కనీసం తాగడానికి గుక్కెడు మంచి నీరు లేదు. ముసలివారు, మహిళా రైతులు ఆ చెట్టు నీడనో.. గోనె సంచీల నీడనో తలదాచుకుంటున్నారు. మరుగుదొడ్ల సౌకర్యం లేదు, నీడ కోసం పందిళ్లు లేవు. తేమ శాతం సాకుతో కాలయాపన చేస్తూ గన్నీ సంచీలు లేవని చెబుతూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో రైతులంటే అధికారులకు చిన్నచూపు ఎందుకు ప్రశ్నిస్తున్నారు. తరుగు పేరుతో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని, లేకుంటే ఆందోళనలు చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి, ఈ దోపిడీని ఆపి, అన్నదాతను ఆదుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.





Total views : 61414