Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Latest News తుమ్మిడిహట్టిపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్‌..

తుమ్మిడిహట్టిపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్‌..

by CVR NEWS
తుమ్మిడిహట్టిపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్‌

తుమ్మిడిహట్టిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాజెక్టును పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్‌ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. MCHRDలో నీటిపారుదల ప్రాజెక్టులపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షాసమావేశంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఇంజినీర్లు, నిపుణులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి సమగ్రంగా చర్చించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ను ఏ ఎత్తులో నిర్మిస్తే ఎంత నీటిని వినియోగించుకోవచ్చన్న అంశంపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే కనీసం 100 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశముంటుందని, తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయని వివరించారు నిపుణులు. ఇప్పటికే నిర్మించిన కాల్వలు, మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవడానికి ఇదే సరైన ఎత్తు అని సూచించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి..తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదిత బ్యారేజీ నిర్మాణం వేగవంతం చేస్తూనే 150 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో వెంటనే చర్చలు జరిపి అనుమతులు సాధించాలన్నారు. ఇందుకు కేంద్ర సహకారం కోసం మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాయాలని ఆదేశించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కింద ఇప్పటికే చేసిన భారీ వ్యయాన్ని సద్వినియోగం చేసుకోవాలని..అంతేకాకుండా ఈ ప్రాజెక్టు ద్వారా గరిష్టంగా 100 టీఎంసీల నీటి వినియోగం సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు.

గత చర్చల ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం 148 మీటర్ల ఎత్తుకు అంగీకరించిందని..152 మీటర్లకు మించి నిర్మిస్తే ఆ రాష్ట్రంలో ముంపు ప్రభావం ఉంటుందని నిపుణులు వివరించారు. ఈ నేపథ్యంలో 150 మీటర్ల ఎత్తు మధ్యేమార్గంగా సరైనదని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో ఎక్కడైనా ముంపు ప్రభావం ఉంటే పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని సీఎం స్పష్టం చేశారు. వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు ప్రారంభించాలని..అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉండడంతో కేంద్ర సహకారం కోరాలని సూచించారు. ఇందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వెంటనే లేఖ రాయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అలాగే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసి ప్రాజెక్ట్ అవసరాన్ని వివరించే బాధ్యతను ఉత్తమ్‌కే అప్పగించారు. ఈ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే ఆదిలాబాద్ జిల్లాతోపాటు తెలంగాణ మెట్ట ప్రాంతాల రైతులకు సాగునీరు, తాగునీరు అందుతుందని..తక్కువ ఖర్చుతో గ్రావిటీ ఆధారంగా శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలించే అవకాశం ఉంటుందని చెప్పారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: